వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదని, కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ భగ్నం చేస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మిత్రులపైనే కాంగ్రెస్ పోటీకి దిగుతున్నది.
కూటమి ధర్మానికి నీళ్లొదులుతూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను మోసం చేస్తున్నదని అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉండవని తెలిస్తే ఇండియా కూటమిలో చేరటంపై అప్పుడే ఆలోచించేవారమని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించేందుకు ఎన్నికల బరిలోకి దిగిన ఇండియా కూటమిలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు 18 స్థానాల్లో పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇది బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని, తిరిగి కమలం పార్టీకే లాభం చేకూరుస్తుందని అఖిలేశ్ వాపోతున్నారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పోటీ విషయమై ముందుగానే తాము కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నేత కమల్‌నాథ్‌తో చర్చించామని, గతంలో తాము గెలిచిన స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాల జాబితాను ఇచ్చామని తెలిపారు. కానీ తాము గెలిచిన సీట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిందని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ నేత అజయ్‌రాయ్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వివాదం మొదలైంది. మధ్యప్రదేశ్‌లో ఎస్పీకి బలమే లేదని, అక్కడ ఆ పార్టీ పోటీ చేయకూడదని పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించటం సమాజ్‌వాదీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
‘ఈ చోటా మోటా కాంగ్రెస్ నేతలంతా బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నారు. ముందుగా తెలిసి ఉంటే మా నాయకులను కాంగ్రెస్ వద్దకు పంపేవారము కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.