భారతదేశంలో ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో సెమీ స్పీడ్ రైళ్లు దూసుకెళుతున్నాయి. ఇప్పుడు రీజనల్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయబోతున్నాయి. ‘రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర సర్కార్ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనికి నమో భారత్ గా పేరు పెట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్ఎక్స్ రైలుకు ప్రధాని జెండా ఊపారు.
ఈ కార్యక్రమంలో యూపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు పాల్గన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు.
గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ హై స్పీడ్ రైలులో అధునాతన సదుపాయాలుంటాయి. ఢిల్లీ- గాజియాబాద్- మేరఠ్ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.
నమోభారత్ రైళ్లలో అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. ప్రతి రైలులో 2 ప్లస్ 2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడటానికి విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర ఎగ్జిట్ మార్గాలు, లాప్టాప్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్ వ్యవస్థ ఉంటాయి.
ఈ హై స్పీడ్ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి. తర్వాత అవసరాన్ని బట్టి అయిదు నిమిషాలకొకటి నడుపుతారు. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు.
ప్రామాణిక కోచ్‌లలో టికెట్ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది. ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవఅద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు.
ప్రీమియం కోచ్‌లలో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్ల అమరిక ఉంటుంది. కోటు, పుస్తకాలు వంటివి తగిలించుకునే ఏర్పాట్లు చేశారు. ఫుట్ రెస్ట్లు ఉంటాయి. ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు అందుబాటులో ఉంటారు. ఎనిమిది ఆర్ఆర్టీఎస్ కారిడార్లకుగానూ ముందుగా మూడింటిని ప్రాధాన్య ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు.