అత్యాధునిక ఆయుధాలను, సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా చైనా యుద్దానికి సన్నద్ధమవుతున్నట్లు అమెరికా అనుమానిస్తున్నది. చైనా సైనిక వ్యూహాలు, బలాలకు సంబంధించిన కొద్దికాలం క్రితం విడుదల చేసిన కీలకమైన పత్రాలు ఈ అంశాన్ని వెల్లడి చేస్తున్నాయి.
చైనా ప్రభుత్వం ప్రస్తుతం సైన్యంపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా కొత్త ఆయుధాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలుపరుస్తున్నది. 2035 నాటికి చైనా తన పాత ఆయుధాలన్నింటినీ తొలగిస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే కృత్రిమ మేధస్సు, యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులతో సహా ప్రపంచంలోని ప్రముఖ మిలిటరీలలో ఒకటిగా చైనా ఉంది. చైనా సైన్యం ఆధునికీకరించడంతో తైవాన్‌పై ఒత్తిడి పెరిగి, తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో వివాదాస్పద ద్వీపాలను సైనికపరంగా ఆధీనంలో ఉంచుకొనడం ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరింత దూకుడుగా చైనా వ్యవహరించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైనికపరంగా ఆధిపత్యంలో ఉండడంతో పాటు అమెరికాను సహితం ఢీకొట్టగల స్థితికి చేరేందుకు వీలుగా చైనా తన సైన్యాన్ని ఆధునీకరిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులు రక్షణ రంగానికి విశేషంగా పెంచుతున్న చైనా, వాస్తవానికి బడ్జెట్ లో చూపిన మొత్తాలకన్నా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
మధ్య ఆసియా, ఐరోపాల ద్వారా తన ఆర్ధిక ప్రయోజనాలను విస్తరించుకొంటున్న చైనా విదేశాలలో సహితం తన సైనికబలంను ఉపయోగించుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది.
చైనా సైన్యంకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తాయి. అందులోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఊసే ఉండదు. తమ వద్ద ఎంత సైన్యం ఉన్నది, ఎన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తి ఉన్నది చైనా అసలే బయటపెట్టదు.
ఈ నేపథ్యంలో చైనా సైన్యంకు సంబంధించిన పలు విషయాలను అమెరికా డాక్యుమెంట్ రూపంలో బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్‌ను అమెరికా ఆర్మీ విడుదల చేసింది. 252 పేజీలుగా ఉన్న ఈ నివేదికకు ‘ఏటీపీ 7-100.3’ అని పేరు పెట్టింది. ఈ నివేదిక చైనా పీపుల్స్ ఆర్మీ నిర్మాణం, సామర్ధ్యం గురించి వెల్లడిస్తుంది. అమెరికా ఆర్మీ శిక్షణ కోసం ఈ డాక్యుమెంట్ రూపొందించారు.
చైనా రక్షణాత్మకంగా భావించే పలు నిర్ణయాలు, ఇతర దేశాలకు దూకుడుగా ఉంటాయని ఈ నివేదికలో వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలనే నిర్ణయం దీనికి సరైన ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, డాక్యుమెంట్లో చైనా సైన్యం గురించి మాత్రమే ప్రస్తావించారు.
20 సంవత్సరాల పాటు చైనా సైన్యాన్ని నిరంతరం చూసిన తర్వాత అమెరికా ఈ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది. చైనా పీపుల్స్ ఆర్మీలో మూడు కమాండ్స్.. లైట్ వెహికిల్ ఆర్మీ, హెవీ హ్యాండెడ్ ఆర్మీ, ఆర్మర్డ్ వెహికిల్స్ ఉన్నాయి. సైనిక వాహనాల విషయంలో అమెరికా సైన్యం కంటే చైనా సైన్యం ముందున్నది.
చైనాలో కూడా 18 రిజర్వ్ ఫోర్స్ యూనిట్లు ఉన్నాయి. కానీ, అవి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా పరిగణించడం లేదు. చైనీస్ ఆర్మీలోని అతి ముఖ్యమైన బ్రిగేడ్లకు ముందుగా ఆత్యాధునిక ఆయుధాలు ఇచ్చారు. ఇక్కడి పాత ఆయుధాలను తక్కువ ప్రాముఖ్యత కలిగిన బ్రిగేడ్లకు పంపారు.
ఇటీవల లడఖ్‌లో భారతదేశం-చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగిన సమయంలో సరిహద్దులోని జిన్జియాంగ్ మిలటరీ జిల్లాకు చైనా కొత్త సైనిక పరికరాలను పంపింది.