హమాస్ ల ఉగ్రదాడితో విస్తుపోయిన ఇజ్రాయెల్ ప్రతీకారంతో సాగిస్తున్న ముప్పేట దాడులతో గజగజలాడుతున్న గాజాకు భారత్ మానవతా సాయాన్ని పంపింది. పాలస్తీనియన్లను ఆదుకునేందుకు 6.5 టన్నుల వైద్య పరికరాలు, శస్త్రచికిత్స సామగ్రి, ప్రాణాధార ఔషధాలు, 32 టన్నుల విపత్తు నిర్వహణ పరికరాలు, టెంట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, నీటి శుద్ధీకరణ మాత్రలను భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో పంపినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పలు వివరాలను పోస్ట్ చేశారు. ఐఏఎఫ్ విమానం ఈజి్ప్టలోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని చెప్పారు. మానవతాసాయానికి సంబంధించిన కంటైనర్లను అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తరలిస్తారని వివరించారు.
‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఆదివారం మరో 143 మంది భారత్‌కు చేరుకున్నారని, వారిలో ఇద్దరు నేపాలీలున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు విమానాల్లో 1,200 మందిని భారత్‌కు తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
అటు ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా మీదుగా శనివారం 20 ట్రక్కుల్లో మానవతా సాయం గాజాకు చేరగా.. ఆదివారం మరో 19 ట్రక్కులను తరలించినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) వర్గాలు వెల్లడించాయి. విడతల వారీగా మరో 300 ట్రక్కులను గాజాకు తరలిస్తామని చెప్పాయి.
మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో.. హిజ్బుల్లా ఉగ్రవాదుల రాకెట్ దాడులు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సందర్శించారు. ఈ సందర్భంగా లెబనాన్, హిజ్బుల్లాపై ఆయన విరుచుకుపడ్డారు.
కాల్పులను ఆపకుంటే.. లెబనాన్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు గాజాపై దాడులను తీవ్రతరం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. గ్రౌండ్ వార్ కోసం ‘నీలి’ పేరుతో బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ డిప్యూటీ హెడ్ మహమ్మద్ ఖటామష్ చని పోయినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
కాగా.. హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేస్తున్న యుద్ధంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నట్లు హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ కాసీం పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ముప్పేట దాడులు కొనసాగుతుండడంతో గాజాలో ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా తయారైంది. 700 పడకలున్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు సైతం 5 వేల మందికి పైగా రోగులతో కిక్కిరిసిపోతున్నాయని షిఫా ఆస్పత్రి వైద్యుడు మహమ్మద్ అబూ సేల్మియా, సెంట్రల్ గాజా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నిదాల్ అబేద్ వాపోయారు.
ఔషధాల కొరత తీవ్రంగా ఉందని, విద్యుత్తు లేక.. సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో సర్జరీలు చేయాల్సి వస్తోందని వారు వివరించారు. అనస్తీషియా కొరత తీవ్రంగా ఉందని, బ్యాండేజీలు లేక, దుస్తులతో కట్లు కడుతున్నట్లు చెప్పారు. యాంటీ సెప్టిక్ స్థానంలో వెనిగర్, గాయాలకు కుట్లు వేసే పరికరాలు లేక.. దుస్తులను కుట్టే సూదులను వాడుతున్నామని చెప్పారు.
భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోండి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై సౌదీ యువరాజు తుర్కీ-అల్-ఫైసల్ తీవ్రంగా స్పందిస్తూ ఇజ్రాయెల్‌పై కుట్రపూరిత దాడి చేసి హమాస్ తప్పిదం చేసిందని, అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా గాజాపై దాడులతో అమాయకులను పొట్టనబెట్టుకుంటోందని చీవాట్లు పెట్టారు. ‘‘ఈ యుద్ధంలో హీరోలెవరూ లేరు. కానీ, బాధితులున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత స్వాతంత్ర్యోద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆ సమయంలో చేసిన శాసనోల్లంఘన ఉద్యమం బ్రిటిషర్లకు వణుకు పుట్టించిందని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు తామొక పరిష్కారాన్ని తీసుకువస్తున్న తరుణంలో హమాస్ దాడులు జరిపి.. ఆ ప్రయత్నాలను అడ్డుకున్నదని ఆరోపించారు.