భారత క్రికెట్ లో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్.. దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. భారత్ తరఫున 67 టెస్టలు, 10 వన్డేలు ఆడారు. టెస్టుల్లో ఏకంగా 266 వికెట్లు సాధించారు. వన్డేల్లో మాత్రం కేవలం 7 వికెట్లు మాత్రమే తీశారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 1560 వికెట్లు తీసిన రికార్డు బిషన్ సింగ్ బేడీది. 370 మ్యాచ్ ల్లో అతడు ఈ ఘనతను సాధించారు. భారత్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. 1966 నుంచి 1979 మధ్య కాలంలో అతడు భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.
ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్ సింగ్ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. ఒకప్పుడు బిషన్ సింగ్ బేడీ బంతిని అందుకుంటే వికెట్ ఖాయం అని అందరూ అనుకునేవారు.
లెఫ్టార్మ్ స్నిన్నర్ అయిన బేడీ తన వేళ్లతోనే బంతిని గింగిరాలు తప్పుతూ ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేవారు. నేటి తరం లెఫ్టార్మ్ స్పిన్నర్లలో చాలా మంది బేడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. బంతిని టర్న్ చేయడంతో పాటు ఆర్మ్ బాల్ తో ప్రత్యర్థులను తికమక పెట్టిన ఘనుడు బేడీ.
తన ఇంటర్నేషనల్ కెరీర్లో 22 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ తన ఆధ్వర్యంలో ఎంతోమంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు. ఇండియా తన తొలి వన్డేలో విజయం సాధించడంలో బిషన్ సింగ్ బేడీ కీలకపాత్ర పోషించాడు.
1975 ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో బేడీ 12-8-6-1 గణాంకాలతో అదిరిపోయే రీతిలో ప్రదర్శన చేశాడు. 1978-79 కాలంలో ఢిల్లీ జట్టును రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలోనూ బేడీ రాణింపు కారణమని అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటారు.
రిటైర్మెంట్ అనంతరం బిషన్ సింగ్ బేడీ టీమిండియా మేనేజర్ గా, సెలెక్టర్ గా కూడా పనిచేశాడు. మురళీ కార్తిక్ లాంటి వాళ్లకు మెంటార్ గా కూడా ఉన్నారు. తొలి తరం బౌలర్లలో అత్యుత్తమ స్పిన్నర్లలో బిషన్ సింగ్ బేడీ ఒకరు. స్పిన్ లో వేరియేషన్స్ తీసుకువచ్చిన ఘనత కూడా బిషన్ సింగ్ బేడీకి దక్కుతుంది.
