ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ముఖ్యంగా బేవరేజ్ కార్పొరేషన్ వంటి సంస్థల పైన కేంద్రం దర్యాప్తు జరిపించాలని కోరారు.
ప్రధానంగా ఈ ఏడాది జులై 26న ఆర్థిక అవకతవకలు, అప్పటి వరకు చేసిన మొత్తం అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు చేసినట్లు ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ తీరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మొత్తం రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ.4.42 లక్షల కోట్ల అప్పులను మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్పొరేషన్లు సహ ఇతర అవసరాలకు చేసిన అప్పులను ప్రస్తావించలేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, భవిష్యత్తులో కట్టలేక వచ్చే సమస్యల నుంచి బయట పడేయాలని బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలను ఈ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు పురందేశ్వరి వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, ఆస్తుల తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, ఇతర గ్యారంటీలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ప్రధానంగా ఆమె కోరారు.
గత నాలుగేళ్లగా చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేని దయనీయ స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ అంశాపై ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నాయని ప్రస్తావించారు.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రం మీద ఉన్న మొత్తం అప్పు రూ.11 లక్షల కోట్లు వరకు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ రుణం రాబోయే 30 ఏళ్లలో తీర్చాలన్నా ఏడాదికి కనీసం రూ. 36 వేల కోట్లు అవసరమవుతుందని చెప్పారు.
ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ మరింత కష్టంగా మారుతుందని వినతిపత్రంలో ప్రస్తావించారు. మద్యం ద్వారా సంవత్సరానికి వచ్చే రూ.30 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి రాకుండా మళ్లిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.