కాంగ్రెస్ పార్టీని ఓ కాలం చెల్లిన ఫోన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ పాత ఫోన్‌ను ప్రజలు 2014 లోనే దేశ ప్రజలు విసిరేశారని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2014 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుందని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాలం చెల్లిన ఫోన్లకు ఎన్ని రిపేర్లు చేసినా అవి పనిచేయవని ఎద్దేవా చేశారు. ఆ ఫోన్లను రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినా.. చివరికి బ్యాటరీ మార్చి కొత్త బ్యాటరీ తెచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజలు 2014లో అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలిపెట్టి దేశానికి సేవ చేసే అవకాశం తమకు ఇచ్చారని వెల్లడించారు. ఈ క్రమంలోనే 2014 సంవత్సరం కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, అది ఒక మార్పుకు సంకేతమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఇక టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు.
మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకోవడం నుండి ఎగుమతిదారుగా భారత్ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఆపిల్ నుండి గూగుల్ వరకు, అతిపెద్ద టెక్ కంపెనీలు దేశంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చాయని పేర్కొంటూ ఈ సందర్భంగా కొన్ని గణాంకాలను విడుదల చేశారు.
5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచిన తర్వాత ఇప్పుడు 6జీ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 4 లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
బ్రాడ్‌బ్యాండ్ వేగంలో గతంలో భారత్ 118 ర్యాంక్‌లో ఉండగా, ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరుకుందని చెప్పారు. గూగుల్, శామ్సంగ్, యాపిల్ సంస్థలకు చెందిన ఫోన్లు ఇప్పటికే మన దేశంలో తయారవుతున్నాయని చెబుతూ ఇప్పుడు ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం భారత్‌కు గర్వకారణమని నరేంద్ర మోదీ తెలిపారు.
గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన కుంభకోణం గురించి దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. తమ హయాంలో 4జీని అందుబాటులోకి తీసుకువచ్చినా చిన్న అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.భారత్ టెలికాం టెక్నాలజీ డెవలపర్‌గా, ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతోందని కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.