దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి ప్రాణహాని బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇమెయిల్ ద్వారా వచ్చిన హత్య బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయి.
అక్టోబర్ 27న రిలయన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీకి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సెక్యూరిటీ హెడ్‌కి రాత్రి 8.51 గంటలకు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద మెయిల్ వచ్చింది. అందులో వారు అంబానీని రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.
పైగా తమ వద్ద దేశంలోని అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, డబ్బులు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తానని బెదిరించారు. మెయిల్ వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా గాదేవి పోలీసులు ఐపీసీ సెక్షన్ 387, 506(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అంబానీ, ఆయన కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు రావటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ యాంటిలియాపై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ముకేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు నింపిన కారును గుర్తించి స్వాధీనం చేసుకోవటం అతిపెద్ద ప్రకంపనలు సృష్టించింది.
2022లో కూడా అతనికి హత్య బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల అనంతరం పోలీసులు కేవలం 3 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అంబానీ బంగ్లాను బాంబులతో పేల్చివేస్తామని నాగ్‌పూర్ పోలీసులను కూడా గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. ఈ బెదిరింపును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ కేసులో బీహార్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి బెదిరింపులు రావటం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రముఖ వ్యాపారవేత్తకు ప్రాణహాని ఉన్నందున కేంద్ర ప్రభుత్వం సైతం ఆయన భద్రతను మరింత పటిష్ఠం చేసింది.
ఈ క్రమంలో ఆయనకు జెడ్+ కేటగిరీ భద్రతను ఇవ్వగా, భార్య నీతా అంబానీకి వై+ కేటగిరీ భద్రతను కొనసాగిస్తోంది. దీనికి తోడు సి ఆర్ పి ఎఫ్ బలగాలు అంబానీ కుటుంబం నివశించే ఇల్లు, కార్యాలయం చుట్టూ భద్రతను కూడా అందిస్తున్నారు.