కేసీఆర్ సర్కారుపై ఉధృతంగా పోరాడండి, ఎక్కడా తగ్గొద్దు అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెబుతూ 2023 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు.
గత సాయంత్రం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినదని తెలిపారు. ఇక్కడ పార్టీ బలోపేతం కోసం సీరియస్ గా పని చేయాలని చెప్పారు.
నాయకుల మధ్య మంచి సమన్వయం ఉండాలని చెబుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ల సమస్యలపై పోరాడితేనే నాయకులుగా ఎదుగుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ బాగా బలీయంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కడా రాజీపడకుండా ఉద్యమించాలని సూచించారు. అయితే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఆశించి మాత్రం పని చేయవద్దని హితవు చెబుతూ అలా అయితే పార్టీలో భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.
‘‘స్వయంగా నేనే హైదరాబాద్ కు వచ్చి నిరసన ర్యాలీలో పాల్గొని, కేసీఆర్ కు వ్యతిరేకంగా అంత గట్టిగా మీడియా సమావేశంలో మాట్లాడానంటే మీరు అర్థం చేసుకోవాలి.. టీఆర్ఎస్ సర్కార్ పై కేంద్ర పార్టీ విధానం ఎట్లుందో గుర్తించాలి” అని సూచించారు.
సంజయ్ అరెస్టుకు నిరసనగా, జీవో 317 సవరణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఆందోళనలో జాతీయ నేతలను పిలిపించి పాల్గొనేలా చేసిన తీరును అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ జీవో 317 సవరణ కోసం తాను దీక్షకు దిగి అరెస్టయిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారని చెబుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా జాతీయ నాయకత్వానికి, ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక ముందు కూడా టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు చేపట్టే ఆందోళనల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పేర్కొన్నారు.
చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు డా. కె లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రాజాసింగ్ పాల్గొన్నారు.