కేంద్ర ప్రభుత్వ సహకారం తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతుందని చాటి చెప్పే ప్రచార కార్యక్రమానికి తిరుపతి నుంచే శ్రీకారం చుడుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో ఈరోజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని విమర్శించారు.
రాష్ట్రం లో జరిగే అభివృద్ధి పనులకు అభివృద్ధికి పెద్దపీట వేసే నరేంద్రమోదీ ప్రభుత్వమే కారణమని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. స్థానికంగా రూ 1700 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని, అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం రూ 311 కోట్లతో జరుగుతోందని, ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు రూ 600 నుంచి రూ. 800 కోట్లు అందించామని ఆమె వివరించారు.
స్మార్ట్ సిటీ పధకం కింద తిరుపతి నగరానికి రూ 1695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని, తిరుపతిలో 21వేల తాగునీటి కనెక్షన్లు, 16వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించామని ఆమె తెలిపారు. అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం మోదీ చేస్తున్నారని ఆమె వివరించారు.
అలిపిరి మండపాల పునరుద్దరణపై అభ్యంతరం
పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పురాతన, ప్రాచీన మందిరాలు, మండపాలను టిటిడి తొలగించడం, పునరుద్దరించడం వంటి చర్యలు మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఆమె టి టి డి పునరుద్దరించ తలపెట్టిన అలిపిరి పాదాల మండపం సమీప పురాతన మండపాన్ని పరిశీలించారు.
సవరించిన నిబంధనల మేరకు 75 ఏళ్లు పైబడిన నిర్మాణాలు భారత పురావస్తు శాఖ పరిధిలో ఉంటాయని ఆమె తెలిపారు. అటువంటిది 550 ఏళ్ల పైబడిన పాదాల మండపం ప్రాంత నిర్మానాలను పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారని ఆమె ప్రశ్నించారు.
తిరుమలలో పురాతన పార్వేట మండపాన్ని తొలగించి ఇష్టానుసారంగా నిర్మాంచారని ఆరోపిస్తూ .పునరుద్ధరణ పేరుతో తొలగించడాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. కనుక అలిపిరి వద్ద మండపాలను తొలగించాలంటే పురావస్తు శాఖ అనుమతితో తీసుకోవాలని పేర్కొన్నారు.
భక్తులు హుండీలో వేసే కానుకలను సనాతన, ధర్మ పరిరక్షణకే మాత్రమే కేటాయించాలని అంటూ ఒక శాతం నిధులంటూ టిటిడి నుండి మున్సిపాలిటీకి ఇవ్వడం తప్పుపట్టారు. స్వామి వారి హుండీ నుండి ఒకశాతం నిధులు తీసుకోవడం చాలా దుర్మార్గమని అంటూ ఇటువంటి ప్రయత్నాలపై ఖచ్చితంగా దీనిపై బిజెపి పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు. ఇంకా ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలలోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు.