తెలంగాణాలో ఇప్పటికే బిజెపి సీనియర్ నేతలు డాక్టర్ లక్ష్మణ్, జి. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించగా గజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేసినట్లు వెల్లడించారు.
గద్వాల స్థానం నుంచి తనకు బదులు బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని డీకే అరుణ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, తెలంగాణలో జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12 స్థానాలు తమకు కేటాయించాలని జనసేన పార్టీ కోరుతోంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్పల్లి సహా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ పరిధిలో మరి కొన్ని స్థానాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారా? బీజేపీ నుంచే మరో అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ జరుగుతోంది.
ఏదేమైనా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను ఉండట్లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి బాటలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఆమె ఆసక్తి కనబరుస్తున్న ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బలంగా ఉందన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే అరుణ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అంటే అది బీజేపీతో నే సాధ్యం అని ప్రజలు భావిస్తున్నారని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రజల జీవన స్థితి మెరుగుపడుతుందని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇస్తూ తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన జనం ఇప్పటికే చూశారని, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని వారు ఆలోచిస్తున్నారని ఆమె వెల్లడించారు.
బీజేపీ విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తుందని చెబుతూ ఇదివరకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడు సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే చేరారని అరుణ గుర్తుచేశారు. ఇప్పుడు రాథోడ్ బాపూరావు విషయంలోనూ అదే జరిగిందని ఆమె చెప్పారు.