మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇడి విచారణకు గైర్హాజరయ్యారు. ఇడి నోటీసులు చట్ట విరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. బిజెపి ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.
సమన్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇడికి లేఖ రాశారు. తనకు వ్యక్తిగతంగా ఆ సమన్లు పంపారా? లేక ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో ఉన్న వ్యక్తిగా పంపించారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌గా తనకు సమన్లు అందాయా? అనేది తనకు పంపిన సమన్లలో స్పష్టంగా చెప్పలేదంటూ ఎదురు ప్రశ్నలు విసిరారు.
తనకు అక్టోబర్ 30వ తేదీన మధ్యాహ్నం సమన్లు పంపిన వెంటనే త్వరలో తనని అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటనలు ఇచ్చారని, అదే రోజు సాయంత్రానికి తనకు సమన్లు అందాయని చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ముందుగానే బీజేపీ నేతలకు ఈ సమన్ల విషయం లీక్ చేశారని, కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాల మేరకు తనకు సమన్లు జారీ చేశారని ఆయన ఆరోపించారు.
కేజ్రీవాల్ రాసిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి. ఈ కేసులో విచారణను ఆరునుంచి 8 నెలల్లోగా పూర్తి చేస్తామని ప్రాసిక్యూషన్ ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నందున దగ్గర్లో ఉన్న మరో తేదీన విచారణకు రావలసిందిగా కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఇడి వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌కు అక్టోబర్ 30న ఇడి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు గైర్హాజరయిన కేజ్రీవాల్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు.