ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సూచనప్రాయంగా వెల్లడించారు. శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగన దేవభూమి ద్వారకలో ప్రకటించారు. ప్రఖ్యాత ద్వారకాధీశ ఆలయాన్ని శుక్రవారం ఉదయం కంగన సందర్శించిన సందర్భంగా ఈ విషయం తెలిపారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు శ్రీ కృష్ణ కీ కృపి రహీతో లడేంగే (శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉంటే పోటీచేస్తా) అంటూ ఆమె జవాబిచ్చారు. 600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండడడంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
బిజెపి ప్రభుత్వం కృషి కారణంగానే 600 సంవత్సరాల పోరాటం తర్వాత భారతీయులకు ఈ సుదినం రానున్నదని ఆమె చెప్పారు. అత్యంత వైభవోపేతంగా అయోధ్య రామాలయాన్ని ప్రారంభించుకుంటామని ఆమె చెప్పారు. ప్రపంచమంతటా సనాతన ధర్మం పతాక ఎగరాలని కూడా ఆమె ఆకాంక్షించారు.
ఆమె నటించిన తేజాస్ చిత్రం ఇటీవల విడుదల కాగా అందులో భారత వైమానిక దళ పైలట్‌గా కంగనా నటించింది. ప్రస్తుతం తాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలోనూ, ‘తను వెడ్స్ మను పార్ట్ 3’లోనూ నటిస్తున్నానని కంగనా రనౌత్ చెప్పారు.
సనాతన ధర్మం జెండా విశ్వవ్యాప్తంగా ఎగరాలని తాను ఆకాంక్షిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. సముద్రంలో మునిగిన ద్వారకా నగర అవశేషాలను వీక్షించేందుకు యాత్రికులను అనుమతించేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్టు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
ద్వారకాధీశుడిని చూసేందుకు తాను వీలుచిక్కినప్పుడల్లా ఇక్కడకు వస్తుంటానని కంగనా తెలిపింది. ద్వారక అద్భుతమైన దైవిక నగరమని, ఇక్కడ ప్రతిఒక్కటీ అబ్బురపరిచేలా ఉంటుందని ఆమె పేర్కొంది.