పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి భవిష్యత్ అంధకారంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టులో జరిగిన లోపాలపై సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే 11 మంది అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, మంథని, భూపాలపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలసి శనివారం డ్యాంను పరిశీలించారు.
ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు . రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆయన తెలిపారు.
ఇటీవల కుంగిన మేడిగడ్డ( లక్ష్మీ) బ్యారేజీను కేంద్ర కమిటీ పరిశీంచింది. కేంద్ర జలసంస్థ సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ డ్యా్మ్ ను పరిశీలించారని అంటూ ఆ బృందం ఇచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. భూమి పటిష్టత టెస్ట్ లు సరిగా నిర్వహించకపోవడం, నాణ్యత లేని సిమెంట్ వాడటం వల్లే లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్ధంగా మారిందని పేర్కొన్నారు.
అలాగే అన్నారం బ్యారేజీ కింద పియర్స్ నుంచి వాటర్ నాణ్యత లోపం వల్లే వృధాగా పోతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వలేదని చెబుతూ వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ప్రాజెక్టు నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించడంతో ఈ దుస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టు గుదిబండగా మారిందని మండిపడ్డారు. రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఉపయోగం లేదని చెబుతూ లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం అవినీతిపై విచారణకు కెసిఆర్ అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.