ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ యాప్ నుంచి అందిన దొడ్డిదారి సొమ్మును వెదజల్లుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దుబాయ్ కేంద్రంగా ఉన్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి కాంగ్రెస్‌కు భారీ స్థాయిలో నిధులు అందాయని, ఈ విషయం ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సిఎం భూపేష్ బఘేల్‌కు అందిన రూ 500 కోట్ల పై చిలుకు డబ్బు వ్యవహారంతో స్పష్టం అయిందని మోదీ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని శనివారం దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కొరియర్ ఒక్కరు ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు అయ్యారని, క్రమం తప్పకుండా ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్ సిఎంకు ముడుపులు అందుతున్నాయని ఈ వ్యక్తి దర్యాప్తు సంస్థలకు తెలిపారని వెల్లడించారు.
ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తులో ఉందని మోదీ తెలిపారు. అక్రమంగా ప్రజల డబ్బును కొల్లగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి అధికారం కోసం వీటిని వాడుకొంటోందని, ఈ విధంగా అక్రమాల కాంగ్రెస్ అక్రమ నిధుల దుర్వినియోగం జరుగుతోందని ప్రధాని ధ్వజమెత్తారు. చివరికి కాంగ్రెస్ పార్టీ శివుడి పేరిట వెలిసిన మహాదేవ్ గ్రూప్‌ను తన అక్రమ సంపాదనకు వాడుకొంటోందని ఈ విధంగా శివుడి పేరును మలినపర్చారని విమర్శించారు.
ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారి నుంచి అంతా వెలికితీస్తామని మోదీ హెచ్చరించారు. ఆహార భద్రత చట్టం కింద పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ సదుపాయాన్ని డిసెంబర్ తర్వాత కూడా మరో ఐదేళ్లపాటు పొడిగించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. దేశంలో 80 కోట్ల మందికి రానున్న ఐదేళ్లపాటు వీటిని అందించనున్నామని తెలిపారు.
కాంగ్రెస్‌కు పేదలంటే చిన్నచూపని పేర్కొంటూ పేదలు ఎప్పుడూ పేదలు గానే ఉండాలని ఆ పార్టీ కోరుకుంటుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అవినీతిని భరించారని, మరో 30 రోజుల్లో ఆ సమస్య సమసి పోతుందంటూ ఛత్తీస్‌గఢ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే సంకేతం ఇచ్చారు.
కరోనా నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ అందిస్తున్నారు. మూడేళ్లుగా ఈ పథకం అమలవుతోంది. డిసెంబర్‌తో ఈ పథకం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
కాంగ్రెస్ ప్రచారానికి హవాలా సొమ్ములు
కాగా, కేంద్ర మంత్రి స్మతి ఇరానీ కూడా కాంగ్రెస్ అక్రమ నిధుల వ్యవహారం బయటపడిందని విమర్శించారు. ఛత్తీస్‌గడ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారానికి హవాలా సొమ్ము దండిగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ బోగస్ కంపెనీల ద్వారా హవాలాల రూపంలో మహాదేవ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సిఎంకు ఇటీవలి కాలంలో భారీగా సొమ్ము అందినట్లు వెల్లడైందని కేంద్ర మంత్రి ఆరోపించారు.