తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు అయింది. పలు ధపా చర్చల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు, ఖమ్మం జిల్లాలో నాలుగు సీట్లు జనసేనకు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. కూకట్‌పల్లితో పాటు మరో స్థానం, తాండూర్, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్ కర్నూల్ కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికే మూడు విడతల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 31 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. త్వరలో ప్రకటించనున్న నాలుగో జాబితాలో జనసేనకు కేటాయించిన సీట్లతో పాటు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న మిగిలిన అభ్యర్ధుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భేటీ అనంతరం మీడియాతో మట్లాడిన పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా భావించామని వెల్లడించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీతో చర్చలు జరిపామని, తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని తెలిపారు. తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సీట్ల అంశాన్ని సమన్వయం చేస్తున్నారని చెప్పారు.
ఇటీవల ఎన్డీయే సమావేశంలో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడామమని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొనే బీజేపీ నిర్వహించే బిసిల ఆత్మగౌరవ సభలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు.
జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, ఈ సభకు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించామని చెప్పారు.