లోక్ సభ ఎథిక్స్ కమిటీ సమావేశం ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి సమావేశం 7న జరగాల్సి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ముసాయితా నివేదికను కమిటీ పరిశీలించి, ఆమోదించనున్నది.
బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ ఈ నెల 2న సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యుల కమిటీలో బీజేపీ సభ్యులే ఎక్కువ ఉన్నందున.. మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 2న జరిగిన విచారణకు ఎంపీ మహువా హాజరయ్యారు.
సమావేశంలో సోంకర్ తనను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ ఆమె ఆరోపించారు. కమిటీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన నివేదికలో ఆయనకు వ్యతిరేకంగా సిఫారసులు చేసే అవకాశం లేకపోలేదు. టూర్లు, హోటల్లో బస, టెలిఫోన్ కాల్స్‌కు సంబంధించి సోంకర్ తమను వ్యక్తిగతంగా, అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారంటూ ప్రతిపక్షాలకు చెందిన ఐదుగురు సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ ఆరోపణలను కమిటీ చైర్మన్‌తో పాటు ఇతర సభ్యులు తోసిపుచ్చారు. విచారణ కమిటీ ముందు హాజరైన ఎంపీ మహువా మొయిత్రా వాకౌట్ చేయడంపై నివేదికలో తీవ్రంగా పరిగణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వ్యాపారవేత్త దర్శన్ హీరానాందని నుంచి డబ్బులు తీసుకొని అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.
అయితే, దుబాయి నుంచి తన లాగిన్ వివరాలను ఉపయోగించినట్లు అంగీకరించినట్లు ఎంపీ అంగీకరించారు. కానీ, డబ్బులు తీసుకున్నట్లుగా చేసిన ఆరోపణలను మాత్రం ఖండించారు. చాలా మంది ఎంపీలు తమ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుంటున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.