తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు రెండేళ్లుగా కసరత్తు చేస్తున్న ఉభయ కమ్యూనిస్టులు చివరికి ఎవరి దారి వారిదిగా మారింది. మొదట్లో బిఆర్ఎస్ తో ఎన్నికల పొత్తు చేసుకొని, చెరో రెండు సీట్లు పొందేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కాంగ్రెస్ పంచ చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి వరకు చర్చల పేరుతో కాలయాపన చేయడంతో అసహనంకు గురయ్యారు.
సిపిఎం ముందే తేరుకొని విడిగానే పోటీ చేస్తామని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించి గౌరవాన్ని కాపాడుకుంది. సిపిఐ గుడ్డిలో మెల్లలా ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో ఏదో ఒక పార్టీతో చేరి ఒకటి, రెండు సీట్లయినా దక్కించుకోవాలని కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం అంటే ఆ సీట్లను బిఆర్ఎస్ కు వదిలివేసిన్నట్లే అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే చెప్పేసారు. దానితో పొమ్మన లేక పొగబెట్టినట్లు వీరితో అర్థవంతమైన చర్చలు జరపకపోవడమే కాంగ్రెస్ ఆడిన అసలు డ్రామాగా వెల్లడవుతుంది.
జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో చేతులు కలిపినా ఆ పొత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొడవక పోవడం విచిత్రం. రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలు నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.
పొత్తు విషయాన్ని కేంద్ర కమిటీకి వదిలేస్తున్నామని ప్రకటించిన సిపిఐ చివరకు కాంగ్రెస్ కొత్తగూడెం కేటాయించడంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌పై ఆశలు వదులుకున్న సిపిఎం రాష్ట్రంలో బిజెపి ఒక్క స్థానంలోనూ గెలవకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
బిజెపిని గెలవకుండా చేయడం కోసం తాము పోటీ చేయని చోట బలమైన భాజపాయేతర పార్టీకి మద్దతు ఇస్తామని సిపిఎం ప్రకటించింది. అంటే పొత్తు అంటూ అవమానపరచిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఒకొక్క చోట ఒకొక్క పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పినట్లయింది.
సిపిఎం తమకు వైరా, భద్రాచలం, మిర్యాలగూడ, పాలేరులో మూడు స్థానాలు ఈయమని కోరింది. దీనికి కాంగ్రెస్ మొదట వైరా, మిర్యాలగూడ ఇస్తామంది. ఆ తర్వాత వైరా ఇవ్వకుండా మిర్యాలగూడ, పాతబస్తీలో ఒక స్థానం తీసుకోండని మాట మార్చింది.
ఈ లెక్కన చూస్తే పొత్తు పేరిట ఒక్క మిర్యాలగూడలో తమ అభ్యర్థిని నిలబెట్టి రాష్ట్రమంతా తమ కార్యకర్తలను కాంగ్రెస్ వెంట తిప్పడం వృథా అని సిపిఎం గ్రహించినట్లుంది.నిజానికి కాంగ్రెస్‌లో ఎవ్వరికీ కమ్యూనిస్టులకు తమ పార్టీ సీట్లు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కొందరైతే మనకు కమ్యూనిస్టుల అవసరం దేనికి అని తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే ప్రకటించారు కూడా.
ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరికలు పెరగడంతో వారిలో వారికే కుమ్ములాటలు మొదలై పార్టీని వీడి కొందరు బయటికి వెళుతున్నారు. ఈ హడావుడిలో తమ వారికి కాపాడుకొనేందుకు చేసే పనిలో బిజీగా ఉన్న కాంగ్రెస్ వామపక్షాలను పట్టించుకోలేదు. చివరకు ఒక్క స్థానంతో సిపిఐ తృప్తిపడితే మూడు రంగులకు ఎర్రజెండా తోడైనట్లు అయింది.