కాంగ్రెస్ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో మహాత్మాగాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
‘కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే స్ఫూర్తి పూర్తిగా అంతరించిపోయింది. కాంగ్రెస్ నేతలు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు’ అంటూ ప్రధాని మండిపడ్డారు.
`కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను ఎదగనివ్వలేదు. వెనుబడిన వర్గాలు, దళితులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రతికూల ఆలోచనలను ప్రభుత్వ వ్యవస్థ నుంచి తొలగించాం. వీళ్లు విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి’ అని మోదీ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు. దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణ మాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ రైతులను నిండా ముంచిందని దుయ్యబట్టారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానపరచడం వంటి దేశ వ్యతిరేక అజెండాతో ముందుకెళుతున్నారని ఆరోపించారు.
ఇవాళ దేశంలో అత్యంత అవినీతి, నిజాయితీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజ కుటుంబమేనని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీని మించిన వారెవరూ లేరని ప్రధాని ఎద్దేవా చేశారు.