ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో దుర్వినియోగం అయితే ఎంత ప్రమాదమో తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేస్ టెక్నాలజీ ద్వారా నటి రష్మిక మందాన వీడియోను రూపొందించి, ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు.
దీంతో వెంటనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో అభ్యంతరకరంగా ఉండడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక స్పందించారు. వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడడం చాలా బాధగా ఉందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో తనకే కాకుండా చాలా మందికి భయానికి గురిచేస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు కృతజ్ఞత తెలుపుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటన తాను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే తాను ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఉహించలేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో డీప్ ఫేక్ టెక్నాలజీ మరోసారి తెరపైకి వచ్చింది. డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌లను ఉపయోగించి నకిలీ కంటెంట్‌ను రూపొందించడం. అయితే ఈ వీడియోలు సదరు వ్యక్తులకు అత్యంత సామీప్యంగా ఉంటాయి. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటో, వీడియో, ఆడియోలను రూపొందించవచ్చు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి.
డీప్ ఫేక్‌లు క్రియేట్ చేసేందుకు సోషల్ మీడియా సహా ఇతర ప్లాట్‌ఫాంల నుంచి వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ కవళికలు, వాయిస్ సహా ఇతర నమూనాలను సేకరించి.. టెక్నాలజీ ఆధారంగా నకిలీ కంటెంట్‌ను రూపొందిస్తారు. నటి రష్మిక వీడియోను ఇలానే తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం జులై నెలలో కేరళకు చెందిన ఓ వ్యక్తిని డీప్ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన వీడియోను ఉపయోగించి మోసం చేశారు. సుమారు రూ. 40 వేల వరకు దోచుకున్నారు. తన స్నేహితుడి వలే వీడియో కాల్ చేసి, అత్యవసరంగా కొంత డబ్బు కావాలని కోరారు.
అనుమానం వచ్చిన బాధితుడు వీడియో కాల్ చేయాలని కొక్రాగా డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వీడియో, ఆడియోను మేనేజ్ చేశారు. దీంతో తన స్నేహితుడే అని నమ్మిన బాధితుడు 40 వేల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాకు పంపించాడు. చివరికి నిజం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.