తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే ప్రధాని మోదీ అని పేర్కొంటూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు విని, ఆ స్ఫూర్తితోనే రాజకీయాలలోకి వచ్చానని, ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొన్న బిజెపి జరిపిన బిసి ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తూ మరోసారి మోదీ ప్రధాని కావాలని బిహెలాషను వ్యక్తం చేశారు. అందుకు జనసేన మద్దతుగా ఉంటుందని ప్రకటించారు.
అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారని, ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అంటూ అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని కొనియాడారు.
సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానని జనసేనాని వెల్లడించాయిరు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అని తెలిపారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని పేర్కొంటూ జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారని గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదని చెబుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదని స్పష్టం చేశారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదని చెప్పారు.
చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు శాస్త్రవేత్తలను భుజం తట్టి… చంద్రయాన్-3 సక్సెస్ వైపు నడిపించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేశారని, పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారని ఆయన గుర్తుచేశారు.
దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని, ఎన్నికల ప్రయోజనాలు కాదని చెబుతూ మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఔర్ ఏక్ బార్ మోడీ అంటూ నినదించారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటామని చెబుతూ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.