ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారవేస్తూ అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మంగళవారం పాల్గొంటూ బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని, ఈసారి ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ ప్రభుత్వ వ్యతిరేకత తుఫాన్ మాదిరిగా కనిపిస్తోందని చెప్పారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతుందని పేర్కొంటూ కేసీఆర్ ను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని చెబుతూ బీసీల ఆకాంక్షలను బీజేపీ మాత్రమే పట్టించుకుందని భరోసా ఇచ్చారు. అహంకారం ఉన్నవారికి ప్రజలు ఓట్లు వేయరన్న ప్రధాని మోదీ బీఆర్ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయమన్నీ పేర్కొన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో అహంకార సీఎంకు తెలంగాణ ప్రజలకు ఓటుతో జవాబు ఇచ్చారని చెబుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అని ప్రధాని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో నిరుద్యోగ యువత జీవితాలను బీఆర్ఎస్ నాశనం చేసిందని మోదీ మండిపడ్డారు.
రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెబుతూ తెలంగాణ యువత జీవితాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని మోదీ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడూ బీఆర్ఎస్ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ ఎప్పుడూ తన కుటుంబం కోసమే పనిచేశారని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సీ-టీమ్ అని చెబుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ బీసీ వ్యక్తిని సీఎం చేయాలని ఆలోచించలేదని గుర్తు చేశారు. దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటారని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వంతో ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశామని గుర్తుచేశారు. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్ సభ స్పీకర్ ను చేసిందని చెప్పారు. తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్ నాథ్ కోవింద్‌ను చేసిందని, అదే విధంగా తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని ప్రధాని తెలిపారు.
“బిజెపి..దళితులకు, ఆదివాసులకు ప్రధాన్యతనిస్తుంది. పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. జనం సంపదను లూటీ చేసిన వారి సంగతి తేలుస్తాం. మూడు పార్టీలు కుటుంబ పాలన కోరుకుంటున్నాయి. కెసిఆర్ సర్కార్ ను ఓడించాలా.. వద్దా?. బిఆర్ఎస్.. బిసిని ఎందుకు సిఎం చేయదు? కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఓబిసిల గురించి ఆలోచించవు” అంటూ విమర్శించారు.
తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓబీసీని అయిన నన్ను ప్రధానిని చేసింది బీజేపీనే అని చెబుతూ మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్ కల్పించామని మోదీ తెలిపారు.