బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో, వెలుపల క్షమాపణలు తెలిపారు. మంగళవారం ఆయన సభలో జనాభా విషయంపై చేసిన ప్రసంగంలో మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు దుమారం చెలరేగింది. మహిళలకు ప్రత్యేకించి బాలికలకు లైంగిక పరిజ్ఞానం అవసరం అని, బాలికలకు సరైన సెక్స్ పరిజ్ఞానం ఉండటం వల్లనే రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సామాజికంగా విమర్శలకు దారితీశాయి.
దీనితో ఈ నేత బుధవారం అసెంబ్లీలోకి రాగానే తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి రుచించలేదని, ఈ విషయం తనకు తెలిసిందని, రాష్ట్రంలోని మహిళలకు సరైన సాధికారికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియచేయడం తమ ఉద్ధేశం అని వివరించారు. ఈ క్రమంలో మహిళకు సమగ్రరీతిలో విద్యా , అక్షరాస్యత ఇనుమడించాలనేదే ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈ క్రమంలోనే తాను జనాభా నియంత్రణలో మహిళ కీలక పాత్రకు సరైన పరిజ్ఞానం అవసరం అని తెలిపానని, ఈ దశలో ఎవరైనా నొచ్చుకుంటే, అందుకు బాధ్యత వహిస్తూ తాను క్షమాపణలు తెలియచేస్తున్నానని వెల్లడించారు. తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని వివరించారు.
అయితే సభ ఆరంభం కాగానే బిజెపి సభ్యులు ప్రతిపక్ష నేత విజయ్‌కుమార్ సిన్హా ఆధ్వర్యంలో వెల్‌లోకి దూసుకువెళ్లారు. సిఎం రాజీనామా చేయాలని నినాదాలకు దిగుతూ, ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నితీశ్ చివరికి మెంటల్ తరహా అయ్యారని, ఇక సిఎం పదవికి అనర్హుడని విమర్శించారు.
సిఎం రాజీనామా డిమాండ్‌ను స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి తోసిపుచ్చారు. ప్రజలు, ఈ సభ విశ్వాసం పొందిన వ్యక్తి వైదొలగాలని చెప్పే హక్కు అధికారం ప్రతిపక్షాలకు లేదని తేల్చిచెప్పారు. అయినా గందరగోళ పరిస్థితి కొనసాగింది. దీనితో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
బుధవారం ఉదయం అసెంబ్లీ ముఖద్వారం వద్ద కూడా బిజెపి సభ్యుల నుంచి సిఎంకు నిరసన వ్యక్తం అయింది. సిఎం నితీశ్ చాలాసేపటి వరకూ గేట్ వద్దనే నిశ్చేష్టులై నిలబడ్డారు. తరువాత సభలోకి ప్రవేశించారు. శాసనమండలిలోనూ సిఎం తమ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. తాను జర్నలిస్టుల సమక్షంలో కూడా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినట్లు తెలియచేసుకున్నారు.