లోక్‌సభ నైతిక నియమావళిని, సభ్యత్వ ప్రమాణాలను టిఎంసి ఎంపి మహువా మొయిత్రా పూర్తిగా ఉల్లంఘించారని ఎథిక్స్ కమిటీ ఆక్షేపించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపి మొయిత్రా లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేయాలని కమిటీ పేర్కొంది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఈ ఎంపి తమ లోక్‌సభ సభ్యత్వ హోదాను దుర్వినియోగపర్చారని, వెబ్సైట్ లాగిన్‌ను ఇతరులు వాడుకునేందుకు వీలు కల్పించారని అభియోగాలు వెలువడ్డాయి. దీనిపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఇప్పుడు 500 పేజీల నివేదికను స్పీకర్ పరిశీలనకు పంపించినట్లు వెల్లడైంది.
పలు పార్టీల సభ్యులతో కూడిన నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీ ఈ విచారణ సందర్భంగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపి వివరణను కూడా తీసుకుంది. అయితే తనపై ఆరోపణలు వచ్చాయని, తాను ముడుపులు తీసుకున్నానని ప్రత్యర్థి పార్టీ సభ్యుడు ఆరోపించారని, దీని నిజానిజాలు తేల్చాల్సింది కేవలం ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలని, ఎథిక్స్ కమిటీ కాదని మొయిత్రా పేర్కొన్నట్లు తెలిసింది.
మహువా మొయిత్రా అనధికారిక వ్యక్తులతో యూజర్ ఐడిని పంచుకున్నారని, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదుతో పాటు ప్రయోజనాలు పొందారని, ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన అని కమిటీ నిర్ధారించింది. ‘క్విడ్ ప్రోకో’లో భాగంగా మహువా మెయిత్రా, దర్శన్ హీరానందానీల మధ్య నగదు లావాదేవీలపై భారత ప్రభుత్వం చట్టపరమైన, సంస్థాగత, సయయానుకూల పద్ధతిలో దర్యాప్తు చేయాలి’ అని నివేదిక పేర్కొంది.
ఈ దశలో ఇప్పుడు కమిటీ ఈ ఎంపిని వెంటనే బర్తరఫ్ చేయాల్సి ఉందని పేర్కొన్నట్లు వెల్లడైంది. మరోవంక, టిఎంసి ఎంపి మొయిత్రా వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్ ఆదేశాలు వెలువరించినట్లు ఆమెపై అభియోగాలు మోపిన బిజెపి ఎంపి నిశికాంత్ దూబే బుధవారం తెలిపారు.
ఈ ఎంపి దేశ భద్రతను తాకట్టు పెట్టారని, విదేశాలలోని వ్యాపారికి ఏకంగా లోక్‌సభ వెబ్సైట్ లాగిన్‌కు చొరబాట్లకు వీలు కల్పించారని తాను చేసిన ఫిర్యాదుపై లోక్‌పాల్ స్పందించిందని దూబే చెప్పారు. అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతో పాటు ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు అందుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపింది.