ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టులను ఆదేశించింది. ప్రతి హైకోర్టు తమ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణను నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఈ ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుల ఛీఫ్ జస్టిస్ లకు ఆదేశాలు జారీ చేసింది.
విచారణకు ఉమ్మడి మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యవహారాలను త్వరగా పరిష్కరించేలా పర్యవేక్షించడానికి సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని తీర్పు పేర్కొంది.
కేసుల వివరాలు, విచారణలో ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్సైట్లో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి వాటి వివరాలు పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం జిల్లాల న్యాయవ్యవస్థపై హైకోర్టులకు ఇప్పటికే పర్యవేక్షణ అధికారం ఉన్నందున ప్రతి కేసు స్థితిని సులభంగా పర్యవేక్షించగలదని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కాబట్టి తమ పరిధిలో ఉన్న ఇలాంటి వ్యవహారాలపై సుమోటో కేసులు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు.
కాగా, ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలను సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.