ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు .. 65 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీహార్ అసెంబ్లీలో ఈరోజు బిల్లును ఆమోదించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల కోసం ఆ కోటాను అమలు చేయాలని ఆ బిల్లులో తీర్మానించారు. అయితే రిజర్వేషన్ల విషయంలో 50 శాతం వరకే కోటా ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమాన్ని విధించిన విషయం తెలిసిందే.
తాజాగా బీహార్ అసెంబ్లీలో చేసిన తీర్మానం.. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలను దాటి వేస్తుంది. ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంతకం చేయాల్సి ఉంది. బిల్లులో ఉన్న సవరణలకు ఆమోదం తెలుపుతున్న సమయంలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
రెండు రోజుల క్రితం మహిళలపై సీఎం నితీశ్ కుమార్ చేసిన కామెంట్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన చేపట్టాయి. కొత్త బిల్లు ప్రకారం.. ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఓబీసీలకు 18, ఈబీసీలకు 25 శాతం కోటా ఇచ్చేందుకు నిర్ణయించారు.
ఇక ఎస్టీలకు కేవలం రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. గతంలో ఈబీసీలకు 18, బీసీకు 12, ఎస్సీలకు 16, ఎస్టీలకు ఒక శాతం కోటా మాత్రమే ఉండేది. వెనుకబడిన తరుగతి మహిళలకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేశారు.