ఒక వంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులందరు ఆయనకు బాసటగా నిలిచి, కేసీఆర్ పాలనపై గొంతెత్తి నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా తెలంగాణాలో అధికార పక్షంకు తామే అసలైన రాజకీయ ప్రయామ్నాయం అనే సంకేతం ప్రజలకు ఇవ్వగలిగారు.
అయితే స్వయంగా కాంగ్రెస్ వారసులు రాజీవ్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఎంపిక చేసి, ఎన్నో ఆశలతో రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే, తన దూకుడుతనంతో మొదట్లో పార్టీ కార్యకర్తలలో కొంత ఉత్సాహం కలిగించ గలిగినా ఇప్పుడు పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలిపోయి, దిక్కుతోచక నిస్తేజంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
కేసీఆర్, బిజెపి కుమ్మక్కై, కాంగ్రెస్ ను అణచడంకోసం, బండి సంజయ్ ను నాయకుడిగా చేసేందుకు `అరెస్ట్ నాటకం’ ఆదారంటూ ఇంటి వద్ద నుండి ట్వీట్ లు ఇవ్వడం తప్ప సొంత పార్టీలో వ్యవహారాలు చక్కబెట్టలేక పోతున్నారు.
కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు.. గ్రూప్ రాజకీయాలు.. సొంత పార్టీ నేతలపైనే బహిరంగ విమర్శలు.. ఎవరి దారి వాళ్లది.. ఎవరి స్కెచ్‌లు వాళ్లవి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన పార్టీ పార్టీలోని కుమ్ములాటలు కారణంగా రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నది. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కుదేలవుతున్నది.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఇది మరింతగా ముదిరింది. ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి, అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. రేవంత్‌కు వ్యతిరేకంగా ఒకరి తర్వాత ఒకరు గళం విప్పుతున్నారు. నేతల మధ్య వివాదాలు, విమర్శలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించినప్పటి నుంచి నేతల మధ్య విబేధాలు తరచూ బయటపడుతున్నాయి. తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని, పార్టీ టీడీపీ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్‌కు ముందు నుంచీ పడ్తలేదు.
రేవంత్‌కి తొలి రోజుల్లో మద్దతుగా నిలిచిన ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తర్వాత దూరమయ్యారు. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేల్లో గతంలో తెలుగు దేశంలో కలిసి పనిచేసిన సీతక్క ఒక్కరే రేవంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పీసీసీ అనుబంధ విభాగాలు కూడా చీలిపోయాయి.
తాజాగా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్న ఫైట్ కాంగ్రెస్‌లోని విభేదాలను బయటపెట్టింది. కరోనాతో రేవంత్ ఐసోలేషన్‌లో ఉండగా గురువారం గాంధీభవన్ వేదికగా ఇతర నేతలు హడావుడి చేశారు. కొన్ని నెలల తర్వాత గాంధీభవన్‌కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వనమా రాఘవ అంశంపై మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.
‘కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జాగీరు కాదు… నా జాగీరూ కాదు.. ఈ పార్టీ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలది.. చివరి నిమిషం వరకు సోనియా, రాహుల్ నాయకత్వంలోనే పని చేస్తా.. అనుకోని పరిణామాలు ఎదురైతే ఇంట్లో ఉంటా. కానీ ఇంకో పార్టీలోకి పోను. ఇండిపెండెంట్‌గానే ఉంటా’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎవ్వరి దారి వారిదిగానే ఉంది.
గిరిజన సదస్సులు అంటూ ప్రారంభించి, ఒకటి, రెండు చోట్ల హడావుడి చేసిన రేవంత్ ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం కలసిరాని నాయకులను కలుపుకుపోయే ప్రయత్నం కూడా చేయడం లేదు. రేవంత్‌కు గట్టి మద్దతుదారుడైన రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సహితం జరుగుతున్న వ్యవహారాలపై తలపట్టుకోవాల్సి వస్తున్నది.
పార్టీలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్‌కు చెబుతూనే.. పార్టీ వ్యవహారాలను మీడియా ముందు చర్చించవద్దని సీనియర్లకు హితవు పలకడం తప్పా ఠాకూర్ మరేమి చేయలేక పోతున్నారు.