బంగ్లా యుద్ధం – 23
జుల్ఫికర్ అలీ భుట్టోతో జూలై 1972 సిమ్లా ఒప్పందంపై ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సంతకం చేయడంతో యుద్ధంలో అపూర్వ విజయం సాధించిన భారత్ దౌత్యంలో ఓటమి చెందిన్నట్లు అయింది. ఈ ఒప్పందం అధికారికంగా యుద్ధాన్ని ముగించింది.
యుద్ధంలో గణనీయమైన, విలువైన భూభాగాన్ని , జనాభాలో సగానికి పైగా కోల్పోయినప్పటికీ కూడా పాక్ దౌత్యపరంగా, రక్షణ పరంగా మరింత బలోపేతం కాగలిగింది. నిత్యం భారత్ కు సవాల్ గా పరిణమించింది. సిమ్లా ఒప్పందం సందర్భంగా లభించిన అపూర్వమైన అవకాశాన్ని భారత్ నిష్కర్షగా వ్యవహరించి, సద్వినియోగం చేసుకోలేక పోవడంతో గత 50 ఏళ్లుగా దేశం భారీ మూల్యం చెల్లించుకో వలసి వస్తున్నది.
స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, పశ్చిమాన ఆక్రమించిన 5,800 చదరపు మైళ్ల (15,022 చదరపు కి.మీ.) భూభాగాన్ని వదులుకోవడంతో పాటు, 93,000 మంది పాకిస్థానీ యుద్ధ ఖైదీలను స్వదేశానికి రప్పించడంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన అనేక డిమాండ్లను భారత్ విచిత్రంగా అంగీకరించింది.
పైగా, పాకిస్తానీ సైనిక సిబ్బందిపై బాంగ్లాదేశ్ ప్రభుత్వం యుద్ధ నేరాల విచారణ నిర్వహించదని భారత్ భరోసా ఇచ్చింది. అందుకు ప్రతిగా కాశ్మీర్ పై పాక్ సాగిస్తున్న నిరాధార వాదనలను ఉపసంహరించు కోవడం గురించి ఎటువంటి హామీ భారత్ పొందలేక పోయింది. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగం అంశంపై కూడా నిర్దుష్టమైన హామీ పొందలేక పోయింది. ఆ భూభాగంపై పాక్ తన ఆధిపత్యాన్ని నిలుపుకో గలిగింది.
భారత్ ఆధీనంలో చాలా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ యుద్ధ ఖైదీలు ఉండడంతో, వారిని విడిపించుకోవడం కోసమే సిమ్లా వచ్చిన భుట్టో నుండి భారత్ జాతీయ ప్రయోజనాలు ఎన్నిన్నిటినో సాధించుకునే అపూర్వ అవకాశం లభించింది. పాక్ ఖైదీలను భారత్ నిరవధికంగా తన వద్ద ఉంచుకోలేదనడం నిజమే. వారిని తిరిగి అప్పగించినట్లుగా భారత్ తిరిగి ఏమీ డిమాండ్ చేయలేక పోయింది.
కనీసం పాక్ నిర్బంధంలో ఉన్న భారతీయులను తిరిగి తీసుకు రాలేక పోయింది. ఇప్పటికి 54 మంది సైనికులు పాక్ జైళ్లలో ఉన్నారని అంటున్నారు. బెంగాలీలకు వ్యతిరేకంగా జరిగిన అకృత్యాలలో పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారుల పాత్రను బహిర్గతం చేయడానికి సాక్ష్యాలను నమోదు చేయడానికి భారత్, బాంగ్లాదేశ్ సభ్యులతో న్యాయ కమిషన్ నియమించాలని భారత్ పట్టుబట్టి ఉండవలసింది.
తీవ్రమైన అఘాయిత్యాలకు పాల్పడిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారులను అలాగే ఉంచుకొని, మిగిలిన పాక్ ఖైదీలను అప్పగించి ఉండవలసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమం ప్రధానమైన జాత్యహంకారవాదులైన పాకిస్తాన్ జనరల్‌ల అకృత్యమే అని ప్రపంచ మొత్తంపై తెలుసు. వారిని దోషులుగా నిలబెట్టే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
అపూర్వ అవకాశం కోల్పోయిన భారత్
జమ్మూ కాశ్మీర్‌లోని కాల్పుల విరమణ రేఖ (సిఎఫ్ఎల్)ని వాస్తవ అంతర్జాతీయ సరిహద్దుగా అంగీకరించేలా పాకిస్తాన్‌ను ఒప్పించేందుకు భారత్‌కు ఇది ఒక మంచి అవకాశం. యుద్ధం ముగిసిన ఆరు నెలల తర్వాత జులై, 1972లో జరిగిన సిమ్లా సమావేశంలో భారత్ ఒక అపూర్వ అవకాశాన్ని కోల్పోయింది.
భారత్ కు నిర్దుష్టంగా ఎటువంటి ప్రయోజనం లేకుండానే జూలై 2, 1972న సిమ్లా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్న సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ తన మంత్రివర్గ సహచరులతో లేదా భారత దౌత్యవేత్తలతో లేదా ఉన్నతాధికారులతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని చెబుతున్నారు.
భారత సేనలను విజయంవైపు నడిపించిన జనరల్ మానెక్ షా తో అసలు ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. అప్పటికే ఆయన పట్ల భారత ప్రజలు ఆరాధనాభావంతో చూస్తూ ఉండడంతో సహజంగానే రాజకీయ నాయకత్వం కొంచెం అసౌకర్యంగా భావిస్తూ వచ్చింది.
ఈ యుద్ధంలో భారత్ సైన్యంతో పాటు బంగ్లా ముక్తి బహిని యోధులు కూడా పోరాడారు. బంగ్లా ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా విశ్వాసంలోకి తీసుకోలేదు. యుద్ధం పూర్తికాగానే పాక్ యుద్దఖైదీలను గట్టి రక్షణతో భారత్ కు తరలిస్తుంటే బంగ్లా నాయకులు అప్పుడే అభ్యంతరం చెప్పారు. తామే వారిని యుద్ధనేరాలపై విచారించి,తగు చర్య తీసుకొంటామని స్పష్టం చేశారు. అయితే భారత్ సేనలు వారిని ఒప్పించి తమతో తీసుకు వచ్చాయి.
ఒకప్పుడు కాల్పుల విరమణ రేఖ ఉన్న చోట కొత్త నియంత్రణ రేఖ నిర్వచనం అమలులోకి రావడంతో ఒక విధంగా ఆక్రమిత భూభాగంపై పాక్ ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు అయింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించు కోవాలని పాకిస్థాన్ నుండి ఉపయోగం లేని ఒక హామీని పొందడం తప్ప సిమ్లా ఒప్పందంలో నిర్దుష్టంగా భారత్ ఎటువంటి ప్రయోజనం పొందలేక పోయింది.
భుట్టో హామీలకు మోసపోయిన ఇందిరా!
అమెరికాను కూడా ఎదిరించి యుద్ధంకు సిద్ధపడిన ప్రధాని ఇందిరాగాంధీ సిమ్లా చర్చల సందర్భంగా భుట్టో మాటలకు మోసపోయిన్నట్లు స్పష్టం అవుతున్నది. ఒక దశలో ఆమె సంతకం చేయడానికి నిరాకరించారు. దానితో నిరాశతో వెనుతిరిగి వెళ్ళడానికి భుట్టో తన సమన్లు అన్ని సర్దుకొని సిద్ధమయ్యారు.
అయితే కాశ్మీర్ విషయంలో భారత్ కోరిన మేరకు ఒప్పుకోవడానికి తాను సిద్దమే అని అంటూ అందుకు పాకిస్థాన్ ప్రజలను సిద్ధం చేయడానికి తనకు కొంత వ్యవధి కావాలని కోరాడు. యుద్ధంలో ఓటమి చెందడంతో తమ దేశ ప్రజలు తనపై ఆగ్రవేశాలతో ఉన్న దృష్ట్యా, ఆక్రమిత కాశ్మీర్ భూభాగం అప్పచెప్పడానికి తనకు కొంత వ్యవధి ఇవ్వాలని భుట్టో ప్రాధేయపడ్డారు.
దానితో ఇందిరా మెతక వైఖరి ఆవలంభించిందని, ఆ విషయాన్నీ ఒప్పందంలో అధికారికంగా కూడా పేర్కొనలేదని ఈ చర్చలలో పాల్గొన్న భారత ప్రతినిధులు చెబుతున్నారు. పాక్ ప్రజలలో తన పట్ల ఆదరణ పెరిగేటట్లు భారత్ చేయగలిగితేనే తాను భారత్ చెప్పిన్నట్లు చేయగలనని భుట్టో ఆమెను నమ్మించాడు. ఆ నమ్మకంతో భారత్ మోసపోయింది.
ఈ విషయంలో ఇప్పుడు తాను పరిష్కారంకు వస్తే రాజకీయంగా `ఆత్మహత్య సాదృశ్యం’ కాగలదని భుట్టో చెప్పారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది భారతీయ దౌత్య నిపుణులు ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మక విజయంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటె వివాదాల పరిష్కారం కోసం ద్వైపాక్షిక మార్గాలే అనుసరించాలని పాక్ ఒప్పుకోవడంతో ఇక ఐక్యరాజ్యసమితి లేదా ఇతర ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ప్రమేయంను కోరలేదని వాదిస్తున్నారు.
అయితే, అపరిష్కృతంగా ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఒప్పందంను పాకిస్తాన్ ఎన్నడూ గౌరవించలేదు. అటువంటి నిబద్ధతను కూడా ప్రదర్షింపలేదు. పైగా, నియంత్రణ రేఖను సరిహద్దు సరిహద్దుగా మార్చే విషయంలో కూడా ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు. అటువంటి ఒప్పందాన్ని తాము ఎన్నడూ పరిగణలోకి తీసుకోలేదని ఇప్పుడు పాక్ వాదిస్తున్నది.
మరోవంక, తక్కువ-తీవ్రత సంఘర్షణ, ప్రచ్ఛన్న యుద్ధం, ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్లో చిత్రపటాన్ని మార్చివేసేందుకు అంతులేని ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్ ఈ ఒప్పందానికి ఎన్నడూ కట్టుబడి ఉన్న దాఖలాలే లేవు.
యుద్ధం తర్వాత స్థిరపడిన పాక్
పాకిస్తాన్ మరింత రక్షణాత్మకంగా, మరింత సైద్ధాంతికంగా పొందికగా మనుగడ సాగిస్తూ ముస్లింయేతర మైనారిటీల సంఖ్యను గణనీయంగా తగ్గించుకొంటూ వ్యవహరిస్తున్నది. అదే సమయంలో తన స్వంత ఎజెండాను చురుకుగా కొనసాగిస్తూ సందర్భానుసారంగా అమెరికాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకో గలుగుతున్నది.
సమస్యాత్మక బెంగాలీల తిరుగుబాటుతో కలత చెందకుండా అపరిమితంగా, పాకిస్తాన్ గల్ఫ్‌దేశాల రాచరికాల నుండి ఆర్థిక, దౌత్య, రాజకీయ మద్దతును పొందగలిగింది. దీని వలన జుల్ఫికర్ అలీ భుట్టో “ఇస్లామిక్ బాంబు”ను అభివృద్ధి చేయాలనే తన కలను నెరవేర్చుకోగలిగాడు.
1973లో కింగ్ జహీర్ షాను అతని బంధువు మహ్మద్ దౌద్ ఖాన్ తొలగించిన తర్వాత భుట్టో ఆఫ్ఘనిస్తాన్‌లో జిహాద్‌ను కూడా ప్రారంభించాడు. ఖాన్ దూకుడు సరళీకరణ ప్రచారాన్ని ప్రారంభించాడు. కమ్యూనిస్టు, ఇస్లామిస్ట్ శ్రేణుల నుండి ఎలాంటి వ్యతిరేకతనైనా క్రూరంగా అణచివేశాడు. భుట్టో, ఐఎస్ఐ తో కలిసి పాకిస్తాన్‌కు పారిపోయిన ఇస్లాంవాదులను నేర్పుగా ఏడు ప్రభావవంతమైన గెరిల్లా గ్రూపులుగా ఏర్పాటు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తన శాశ్వత ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఇలా చేయడం చాలా కీలకమైనందున పాకిస్తాన్ తన స్వంత కొద్దిపాటి వనరులతో దీన్ని చేసింది. పాకిస్తాన్ తరచుగా అభ్యర్థనలు చేసినప్పటికీ, చాలా సంవత్సరాల వరకు అమెరికా ఈ వివాదంలో పాల్గొనలేదు.
వాస్తవానికి, 1979లో, అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భుట్టో పట్టుదలతో న్యూక్లియర్ రీప్రాసెసింగ్లో పురోగతికి పాకిస్తాన్‌ను అనుమతించాడు. 1981లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ దీనిని ప్రారంభించిన తర్వాత, ఆంక్షల నుండి పాక్ మినహాయింపులు పొందడం ప్రారంభించింది. ఆ తర్వాత 1982లో అమెరికా, సౌదీ అరేబియా, చైనాతో కలిసి పాకిస్తాన్‌కు భారీ బహిరంగ, రహస్య వనరులు సమకూర్చడం ప్రారంభమైంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ ఆక్రమణ కొనసాగినంతకాలం, అమెరికా పాకిస్తాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళుతున్నట్లు అమెరికా అధికారులు అర్థం చేసుకున్నప్పటికీ, అందుకు నిధులు ఇవ్వడం అమెరికా కొనసాగించింది. 1990లో అమెరికా మళ్లీ ఆంక్షలను విధించినప్పుడు, 9/11 నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి తన వ్యూహాత్మక ప్రాముఖ్యతను పునరుజ్జీవింపజేయగలిగింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు, తాలిబాన్, హక్కానీ నెట్వర్క్ వంటి అనేక తీవ్రవాద సంస్థలకు క్రియాశీలంగా మద్దతు ఇస్తూ, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ప్రయత్నాలను దెబ్బతీసేందుకు పని చేస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ 34 బిలియన్ల డాలర్లకు పైగా సహాయం అందుకుంది. అమెరికా సహాయంతో లబ్ది పొందుతున్నప్పుడు, పాకిస్తాన్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు నిల్వలను సేకరించింది.
అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో పాక్ ఫ్రాన్స్‌ను మించిపోయింది. దక్షిణాసియా, వెలుపల ఆధిపత్యం కోసం భారతదేశం ప్రయత్నాలను తిప్పికొట్టే విషయంలో పాకిస్థాన్ దూకుడుగా వ్యహరింప గలుగుతున్నది.