ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ అయ్యి రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు.
కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కావడం లేదు. అప్పటి నుంచే కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ఆమె బీజేపీకి మొన్న బుధవారం రాజీనామా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
కాగా, విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓవైపు సినిమాల్లో నటిస్తుండగానే రాజకీయ ప్రవేశం చేశారు. మొదట బీజేపీలో చేరిన రాములమ్మ 2005లో సొంతగా తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 2009లో పార్టీని ప్రస్తుతం బీఆర్ఎస్ గా ఉన్న నాటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు.
అటుపై మెదక్ లోక్ సభ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి 2014లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంది రాములమ్మ. అక్కడ కూడా ఇమడలేక..తిరిగి 2020 బీజేపీలో చేరారు విజయశాంతి. ఆ తర్వాత మూడేళ్లు పార్టీలో కొనసాగిన విజయశాంతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.