వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్వాల బిజెపి విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ఇచ్చిన హామీలను కెసిఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ టైమ్ అయిపోయిందని, బిజెపి వచ్చే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బిఆర్ఎస్కు విఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, బిసిలకు కాంగ్రెస్, బిఆర్ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
బిసి సిఎం కావాలంటే బిజెపికి ఓటేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను కెసిఆర్ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. జోగులాంబకు మోడీ వంద కోట్లు నిధులు విడుదల చేస్తే కెసిఆర్ వినియోగించలేదని ధ్వజమెత్తారు.
ఉద్యోగాల పేరిట సిఎం కెసిఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. టిఎస్పిఎస్సీ నుంచి 7 నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రశ్నపత్రాలను లీక్ చేశారు. అలాంటి ఘటనల వల్ల ప్రవళిక, అహ్మద్ వంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు. అవి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని.. బిజెపి అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తి చేస్తామని అమిత్ షా వెల్లడించారు.
జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ టూ. 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టులిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదు” అని విమర్శించారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదని చెబుతూ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. బీసీలకు బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం రూ. 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ రూ. 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని వెల్లడించారు. ముస్లిం మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
దేశంలో, రాష్ట్రంలో 2జీ, 3జీ, 4జీ కుటుంబ పాలన నడుస్తోందని అమిత్ షా దుయ్యబట్టారు. 2జీ కేసీఆర్ – కేటీఆర్, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు విముక్తి కల్పించండని ఆయన పిలుపిచ్చారు.