మినీ సాధారణ ఎన్నికలుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న కీలకమైన ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర నేడు ప్రకటించారు. ఫిబ్రవరి 10న ఎన్నికలు ప్రారంభమై, మార్చి 10న ఫలితాలు ప్రకటనతో ముగుస్తుంది.
ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలలో పోలింగ్ జరుగుతుంది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని చెప్పారు.
పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 15 వరకు రాజకీయ పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలకు పర్మిషన్ లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి యాత్రలు, ర్యాలీలకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చితో ముగియనుండగా.. యూపీ శాసనసభ కాలపరిమితి మే నెలతో పూర్తికానుంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో మొత్తం మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 24.5 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో అధిక శాంతం మహిళా ఓటర్లే ఉన్నారని వివరించారు. ఇందుకు అనుగుణంగా 2,15, 368 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
కోవిడ్ వల్ల ఎన్నికల సమయాన్ని ఒ గంట పొడిగిస్తున్నామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరికి మాత్రమే అనుమతించామని చెప్పారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కరోనా నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు కఠితరం చేయనున్నామనిసుశీల్ చంద్ర పేర్కొ న్నారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి, ఐదు రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితులను పరిశీలించారని తెలిపారు.
కరోనా పెరుగుతున్నందున కొత్త నిబంధనలు పాటించి కరోనా సెఫ్ జోన్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నామని చెబుతూ ఈ నేపధ్యంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులను సీ-విజల్ యాప్ ద్వారా పంపవచ్చునని, ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోపు ఎన్నికల అధికారి స్పందిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.