‘‘ కేసీఆర్.. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణలో బీజేపీ అఽధికారంలోకి వస్తోంది. ఆ వెంటనే అవినీతి, కుంభకోణాలకు బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తాం’’ అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు.
తెలంగాణ బీజేపీ మ్యానిఫెస్టోను “సకల జనుల సౌభాగ్య తెలంగాణ” పేరుతో అమిత్షా విడుదల చేశారు. అందులో 10 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. బీసీ అభ్యర్థినే సీఎంను చేస్తామని ప్రకటించారు.
దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు, అవినీతి అక్రమాలకు పాల్పడిందని, అది దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ ఇవ్వడం ద్వారా ఆ సర్కారును కూల్చడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.40వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, మిషన్ భగీరథలో కమీషన్లు తీసుకున్నారని, మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, మియాపూర్లో రూ4వేల కోట్ల భూకుంభకోణం, మద్యం కుంభకోణాలకు పాల్పడ్డారని, దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్లు ముట్టాయని, లబ్ధిదారుల నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల మేర తీసుకున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.
తీవ్ర అవినీతిమయమైన కేసీఆర్ కారును కేంద్రంలోని మోదీ గరీబ్ కల్యాణ్ గ్యారేజీకి పంపే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. భద్రాచలం క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించడం లేదని విమర్శించారు. చంద్రుడిపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన బీజేపీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
* ధరణి స్థానంలో మీ భూమి యాప్
* ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు
* గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు
* నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు
* బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ
* ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ
* ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో సహకారం
* రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం. తద్వారా అందరికీ ఇల్లు, ఇంటి పట్టాలు అందజేత
* ప్రధానమంత్రి పంటబీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంటబీమా
* అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
* ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం
* వరికి రూ.3,100 మద్దతు ధర
* ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ
* నిజామాబాద్లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
* డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థినులకు ల్యాప్టాప్లు
* నవజాత బాలికలకు ఫిక్స్డ్ డిపాజిట్
* ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు