2023 ప్రపంచ కప్‌లో ఫైనల్స్ వరకు అజేయంగా నిలిచిన భారత్.. కీలక సమయంలో చతికిలపడింది. వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీ మొత్తం అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌తో ఇరగదీసిన భారత్.. ఫైనల్లో ఎప్పటిలాగే తడబడింది.
వరుసగా పది మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు నాసిరకమైన బౌలింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), సెంచరీతో చెలరేగగా మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 58 నాటౌట్, 4 ఫోర్లు)రాణించి ఆసీస్‌కు ఆరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందించారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు వరుసగా షాకులు తాకాయి. రెండో ఓవర్లోనే షమీ డేవిడ్ వార్నర్ (7)ను ఔట్ చేయగా మిచెల్ మార్ష్ (15)ను బుమ్రా ఐదో ఓవర్లో ఔట్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే బుమ్రా స్మిత్ (4) ను కూడా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్, టీమిండియా అభిమానులు ఆనందపడిన క్షణాలంటే ఇవే. ఆ తర్వాత, అంతకుముందూ అంతా ఆసీస్‌దే ఆధిపత్యం..
47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ట్రావిస్ హెడ్ మరోసారి ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. భారత బౌలర్లు కట్టడి చేసినప్పుడు సంయమనంతో ఆడిన హెడ్ ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. లబూషేన్ కూడా అతడికి తోడ్పాడునందించడంతో హెడ్ వీరవిహారం చేశాడు.
అర్థ సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన హెడ్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. హెడ్ – లబూషేన్‌లు క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌కు వికెట్ల రాకే గగనమైంది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించి భారత అభిమానులకు మరోసారి గుండెకోతను మిగిల్చారు. పుష్కరకాలం తర్వాత స్వదేశంలో కప్పు గెలవాలన్న భారత కల మరోసారి చెదిరింది.