దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్ లో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
రైతులను ఎందుకు విలన్లుగా చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. “ఇక్కడ ఎందుకు ప్రతిసారీ రైతులను విలన్లుగా చూపిస్తున్నారు. ఈ కోర్టులో మేం వాళ్లను విచారించడం లేదు. పంట వ్యర్థాలను కాల్చివేయడానికి రైతులకు పలు కారణాలు ఉండవచ్చు” అని తెలిపింది.
“యంత్రాలతో చేసే పంట వ్యర్థాల ప్రక్రియను మీరే (పంజాబ్ ప్రభుత్వం) ఎందుకు 100 శాతం ఉచితంగా చేపట్టడం లేదు. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకోండి. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు రైతులకు ఆ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది” అని సుప్రీం కోర్టు పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది.
దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ, దాని పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. “గత ఆరేళ్లతో పోలిస్తే ఈ నవంబరులో ఢిల్లీ మరింత కాలుష్య నగరంగా మారింది. ఈ సమస్యను అరికట్టే బాధ్యత మీదే” అని కోర్టు వ్యాఖ్యానించింది.
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల కాల్చివేతలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.