మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా రుణాల మాయమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్మండిపడ్డారు. హైదరాబాద్ లో బిజెపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తెలంగాణలో ఆర్థిక నిర్వహణ సరిగా లేదని, రాబోయే తరాలపై రుణభారం మోపుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అయితే, ఇప్పటికి పదేళ్లు అయినా ఆ లక్ష్యం నెరవేరలేదని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పదిగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్న కేసీఆర్ ఆ తర్వాత మర్చిపోయారని ఆమె విమర్శించారు.
ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి ఎంతో గొప్పగా చెప్పి.. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి ఆయనను తొలగించారని ఆమె గుర్తు చేశారు. రూ. 3300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పి కేవలం రూ. 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఆ నిధులన్నీ ఎందుకోసం వాడారో తెలియదని ఆమె చెప్పారు.
తెలంగాణలో 11 వర్సిటీల పరిధిలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ దేశవ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే తెలంగాణలో 66 శాతం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. జాతీయ సగటు కన్నా ఇది తక్కువ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.
రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతూ నిరుద్యోగ భృతి ఇస్తామని.. వదిలేశారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొంటూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.