చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అక్బరుద్దీన్ బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో మొయిన్‌బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ బందోబస్తు పర్యవేక్షించడానికి వెళ్లిన సీఐ శివచంద్ రాత్రి 10 గంటలు కావస్తుండటంతో స్టేజిపైకి వెళ్లారు. సభకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండటంతో ఈ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ ప్రయత్నించారు.
అయితే,అక్బరుద్దీన్ ఒవైసీ సదరు పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్స్పెక్టర్ సాబ్.. నా దగ్గర వాచ్ ఉంది. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్లండి’అంటూ పోడియం నుంచి వేదిక వైపు వెళ్లి పోలీసు అధికారిని హెచ్చరించారు. తనను మాట్లాడకుండా అడ్డుకునేవారు ఇంకా పుట్టలేదని.. తాను ఒక్క సిగ్నల్ ఇస్తే.. ఇక్కడున్నవారంతా పోలీసు అధికారిని పరిగెత్తిస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
‘కత్తులు, బుల్లెట్లు ఎదుర్కొంటే నేను బలహీనుడిని అయ్యానని అనుకుంటున్నావా’ నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి. ఐదు నిమిషాలు మాట్లాడతాను. నన్ను ఎవరూ ఆపలేరు. నేను సిగ్నల్ ఇస్తే మీరు ఇక్కడ్నుంచి పారిపోతారు. అలా చేద్దామా?’ అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరికలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, బెదిరింపుల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీపై ఐపీసీ 06, 153 ఐపీసీ, 505 (2), 506, ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోదరుడిని ఎందుకు మాట్లాడనీయకుండా చేశారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, అక్బరుద్దీన్ బెదిరింపు వీడియోపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంఐఎం నేతలు.. పోలీసు అధికారులనే బెదిరింపులకు బెదిరిస్తున్నారంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్బరుద్దీన్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అక్బరుద్దీన్ పై బుల్డోజర్ యాక్షన్ ఉంటుందని ట్వీట్ చేసింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం ఓల్డ్ సిటీని నాశనం చేస్తోందని, నేరాలకు అడ్డాగా మార్చిందని బీజేపీ ఆరోపించింది.
కాగా, తాను మాట్లాడుతుండగా పోలీసు అధికారి అనవసరంగా వేదికపైకి వచ్చారని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. తాను కూడా సదరు అధికారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ జరిపి ఎవరిది తప్పు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, సంబంధిత అధికారులను కోరారు.