తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప హితవు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతులకు కరెండు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విస్మరించందని, ఆపార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చేస్తున్న అసత్య హామీలు, తప్పుడు వాగ్ధానాలను నమ్మవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నాటక మోడల్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల మోడల్‌గా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని బిజెపి నేత ధ్వజమెత్తారు.
యువనిధి పధకం ఇంతవరకూ తమ రాష్ట్రంలో వెలుగుచూడలేదని, గృహ లక్ష్మి కింద ప్రకటించిన నగదు తమ ఖాతాల్లోకి చేరలేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. మహిళకు ఉచిత బస్ ప్రయాణం హామీని సరిగ్గా అమలు చేయడం లేదని, బస్సుల సంఖ్యను కుదించారని పేర్కొన్నారు.
200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆపై అధికారంలోకి రాగానే గత 12 నెలల్లో సగటున 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్నవారికే ఉచిత్ విద్యుత్ వర్తింపచేస్తామనే నిబంధన విధించిందని యడియూరప్ప పేర్కొన్నారు.