ఆంధ్రాను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నట్టు తెలంగాణను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘జనసేన పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద.. అలాంటి తెలంగాణకు అండగా ఉంటా’ అని ఆయన పేర్కొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మద్దతుగా బుధవారం హన్మకొండలోని హంటర్ రోడ్లో సి.ఎస్.ఆర్. గార్డెన్స్ వద్ద నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తూ తెలంగాణ అంతటా తాను తిరగలేనని, తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతి రహిత తెలంగాణ కావాలని చెప్పారు.
‘2009లో ప్రజా యుద్ధనౌక, నా అన్న గద్దర్ గారితో మాట్లాడినప్పుడు మేం కోరుకున్నది ఒక్కటే.. సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఆ రోజు ఎదురుచూశాం. కానీ, అది సాధ్యం కాలేదు. దేశంలో ఈ రోజు 31 మంది బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
‘తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నా. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించింది. ఆంధ్రా నాకు జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేనూ ఒకడిని’ అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
‘తెలంగాణ నాకు ఎంతో బాలాన్ని ఇచ్చింది. అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నా. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోంది. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాను. ఏ మార్పు కోసమైతే, తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా. మీకు ఏ సమస్యలున్నా నేనొస్తాను. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా’ అని తెలిపారు.
‘పదేళ్లలో నేను తెలంగాణపై ఏ రోజూ మాట్లాడలేదు. కానీ, ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతాను. ప్రధాని మోదీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖల్ని మారుస్తారన్న నమ్మకం నాకుంది. కమలం గుర్తుకు ఓటు వేసి.. రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించండి’ అని ఓటర్లకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. జనసైనికులంతా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.