’ఒక భవన నిర్మాణానికి పునాది ఎంత ప్రధానమైనదో సమాజ నిర్మాణానికి విద్య అంతటి ప్రధానమైనది’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పేర్కొన్నారు. బుధవారం జరిగిన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య అవసరమని ఆమె తెలిపారు.
విద్య నైతిక విలువలను, జీవన విలువలను అందిస్తుందని చెబుతూ ఉన్నతమైన విద్య విజ్ఞానాన్ని అందించడమే కాకుండా సమాజ పునర్ నిర్మాణంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని ఆమె చెప్పారు. ప్రపంచ ఆధ్మాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో సమగ్రమైన విద్యను సత్యసాయి ట్రస్టు ద్వారా అందిస్తుండడం అభినందనీయమని ఆమె కొనియాడారు.
‘సత్యం వద… ధర్మం చర’ అన్న నినాదాన్ని సత్యసాయిబాబా ప్రకటించినట్టుగా ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మాన్ని ఆచరించాలని రాష్ట్రపతి సూచించారు. మహాత్మాగాంధీ కూడా సత్యశోధన ప్రాధాన్యతను ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తు చేశారు. దీనికి ముందు 14 మందికి పిహెచ్‌డిలు, 500 మందికి డిగ్రీలు, పిజి పట్టాలు ఆమె ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 21 మందికి బంగారు పతకాలను అందజేశారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ప్రాచీన ఆధ్యాత్మిక సంపద ఎంతో విలువైనదని తెలిపారు. ప్రాచీన గురుకుల విద్య తరహాలోనే సత్యసాయి విద్యా సంస్థల్లోనూ విద్యను అందించడం ముదావహమని ఆయన పేర్కొన్నారు. లోక సమస్త సుఖీనోభవంతు’ అని వేదాల్లో చెప్పినట్టుగా మన ప్రాచీనపరంపర శాంతి, సౌభ్రాతృత్వాలను కోరుకుంటుందని తెలిపారు.
‘విద్యా దదాతి వినయం… వినయాద్వాతి పాత్రతాం’ అని చెప్పినట్టుగా విద్య ద్వారా వినయం… వినయం ద్వారా అర్హత… అర్హత ద్వారా సంపద అన్నీ వస్తాయని వివరించారు. సమగ్రమైన విద్యను పొందడం ద్వారా విజ్ఞానం పొందడమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడినవారమవుతామని గవర్నర్ వివరించారు.
సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ హాలులో జరిగిన స్నాతకోత్సవాన్ని విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కృష్ణమాచారి చక్రవర్తి ప్రారంభించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, వైస్ ఛాన్సలర్ రాఘవేంద్రప్రసాద్ ప్రసంగించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్, సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఎస్.నాగానంద్ తదితరులు పాల్గన్నారు.
