భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గురువారం కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో వృద్దాప్య సంబంధ వ్యాధులతో ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశాక కేరళలోని పత్తంనతిట్టలో నివాసం ఉంటున్నారు. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు.
అంతేకాదు, ముస్లిం వర్గం నుంచి గవర్నర్ గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించారు. పైగా, కేరళ నుండి 1950లో లా డిగ్రీ పొందిన ఆమె ముస్లిం మహిళలతో ఆ డిగ్రీ పొందిన మొదటి మహిళా కావడం విశేషం.
దేశ న్యాయ వ్యవస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992లో పదవీ విరమణ చేశారు. అంతకుముందు ఆమె ఇన్ కమ్ ట్యాక్స్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ లో జ్యుడిషియల్ మెంబర్ గానూ వ్యవహరించారు.
ఆమె మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆమె పలు ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటూ తమ వృత్తిలో, గౌరవప్రద బాధ్యతల నిర్వహణలో ఘనత వహించారని సిఎం విజయన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మొట్టమొదటి జడ్జిగా పలు కీలక తీర్పులు వెలువరించారని చెప్పారు.
