ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ (ఈసి) గురువారం నోటీసులు పంపింది. ప్రత్యర్థులపై నిర్థారణ కాని ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఇసి నోటీసులో పేర్కొంది. శనివారం సాయంత్రంలోగా వివరణనివ్వాల్సిందిగా పేర్కొంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత మంగళవారం ప్రధాని మోదీని ఉద్దేశించి ‘పనౌటి’, ‘పిక్ పాకెట్’ వ్యాఖ్యలు చేశారు. దానితో, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ర్యాలీలో అవమానకరమైన పదాలను ఉపయోగించారని, పలు ఆరోపణలు చేశారని బిజెపి ఫిర్యాదులో ఆరోపించింది.
ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ భారత్ ఓటమికి ప్రధాని అక్కడకు వెళ్లడమే కారణం అన్నట్లుగా రాహుల్ మాట్లాడటం వివాదాంరేపింది. ‘మన కుర్రాళ్లు అద్భుతంగా ప్రపంచకప్‌ను దాదాపు గెలిచారు కానీ ఓటమిపాలయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ అపశకునం వల్లే ఓడిపోయారంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్ పేర్కొన్నారు.
ఒక సీనియర్ నేత ఇటువంటి పదాలు వినియోగించడం తగదని ఫిర్యాదులో పేర్కొంది. ”మోదీ కొన్ని సార్లు టివిలో కనిపిస్తారు. హిందూ- ముస్లిం అని మాట్లాడతారు. ఒక్కోసారి క్రికెట్ మ్యాచ్‌కు వెళతారు. ఇండియా క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిచేది కానీ ‘చెడ్డ శకునం’ కారణంగా మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది” అని రాజస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.