హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలలో పాల్గొంటూ రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారని ఆరోపించారు.
ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు పట్టుకునే వరకు.. ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారంటూ అమిత్ షా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఓవైసీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందువల్లే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని అమిత్ షా ఆరోపించారు. కారు పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని ధ్వజమెత్తారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులను ఏరి పారేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడినా ఎవ్వరూ ఏమి చేయలేరని విర్రవీగుతున్న కేసీఆర్, కేటీఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకు పంపిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు.
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పెట్రోల్, డీజిల్ రేట్లలో (జీఎస్టీ)ధరలు తగ్గిస్తామమని హామీ ఇచ్చారు. బిజెపి పార్టీ గెలుపుతోనే సబ్బండ కులాల సంక్షేమం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట తప్పని మనిషి అని పేర్కొంటూ తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే బీసీ ముఖ్యమంత్రిని నియమిస్తామని హామీ ఇచ్చారు. మోదీ పాలన రక్షణతో దేశం అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాలకు బలం భరోసా అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానం నిలిచే విధంగా పనులు చేస్తామని చెప్పారు.
మరోవైపు.. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో నిర్వహించిన ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తామని చెప్పుకొచ్చారు.
ఈసారి తెలంగాణలో కచ్చితంగా బీజేపీ సర్కారును తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని చెబుతూ అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందంటూ రాజ్ నాథ్ సింగ్ విమర్శలు చేశారు.
కాగా, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని శుక్రవారం రాత్రి రాష్త్ర బిజెపి నేతలతో జరిపిన భేటీలో అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రజల్లోకి వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాలనను సైతం ప్రజలకు గుర్తు చేద్దాం. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి” అంటూ భరోసా వ్యక్తం చేశారు.
రోడ్, పబ్లిక్ మీటింగ్స్‌లో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని చెబుతూ రానున్న నాలుగు రోజులు ప్రచారాన్ని ఉధృతం చేయమని సూచించారు. బీసీ ముఖ్యమంత్రి అంశం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని అమిత్ షా తెలిపారు.