ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత దేశ వైమానిక సత్తాకు తలమానికమైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో కాసేపు విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో వైమానిక సామర్ధ్యంపై సమీక్ష కోసం వచ్చిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా తేజస్ రెండు సీటర్ల విమానంలో కాసేపు ఆకాశంలో విహరించారు.
ఈ సందర్భంగా మన వైమానిక సామర్ధ్యంపై ఎక్స్ లో ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులోని రక్షణ రంగ ప్రభుత్వ సంస్ధ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించారు.
దాని తయారీ కేంద్రంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. అనంతరం తేజస్ విమానం ఎక్కి కాసేపు చక్కర్లు కొట్టారు. అనంతరం తేజస్ లో తన ప్రయాణాన్ని వివరిస్తూ ఎక్స్ లో ప్రధాని మోదీ ఓ పోస్టు పెట్టారు. ఇందులో తేజస్ లో ఓ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశానని పేర్కొన్నారు.
ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంచిందని మోడీ తెలిపారు. అలాగే మన దేశ సామర్థ్యం గురించి తనకు కొత్త గర్వాన్ని, ఆశావాదాన్ని ఇది మిగిల్చిందంటూ ప్రధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
