దేశంలో మరోసారి కరోనా కేసులు లక్షల సంఖ్యలో వస్తూ ఉండడంతో ప్రజలలో ఆందోళన చెలరేగుతుంది. గత ఏడాది మాదిరిగా తిరిగి దేశవ్యాప్తంగా లేదా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారని భయాలు చెలరేగుతున్నాయి. ఆ విధంగా చేస్తే తిరిగి ఆర్ధిక, ఉపాధి కార్యక్రమాలు కోలుకోలేని విధంగా దెబ్బ తింటాయని ఖంగారు పడుతున్నారు.
అయితే ఈ విషయమై నిబంధనలను ప్రజలు పాటిస్తుంటే సంపూర్ణ లాక్డౌన్ అవసరం లేదని, దాని వల్లన కరోనా కట్టడి సాధ్యం కాదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా, ప్రభుత్వ ఆంక్షలను ప్రజలు విధిగా పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రం లో మరో సంపూర్ణ లాక్డౌన్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు.
ఈ వైరస్ ప్రజలతో శాశ్వతంగా సహజీవనం చేస్తుందని పేర్కొంటూ దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తొలి దశలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట ఏవిధంగా వేయాలన్న అంశంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో దేశంలో సంపూర్ణ లాక్డౌన్ అవసరమైందని ఆమె పేర్కొన్నారు.
కానీ, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని ఆమె తెలిపారు. అందువల్ల ఇపుడు సంపూర్ణ లాక్డౌన్ అక్కర్లేదని చెప్పారు. డెల్టా వైరస్‌తో పోలిస్తే ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందని ఆమె తెలిపారు. అయినప్పటికీ వైద్య సహాయం అవసరమయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు.
అందువల్ల కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి లాక్డౌన్ అవసరం రాదని డా. సౌమ్య స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను అధికమించేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రజలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆమె సూచించారు.
60 యేళ్ళు పైబడిన వృద్ధులతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు విధిగా బూస్టర్ డోస్ కరోనా టీకా వేయించుకోవం ఎంతో మంచిదని ఆమె స్పష్టం చేశారు. అలాగే, ఆయా సీజన్లలో ప్రబలే అంటు వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘ప్రజల వద్దకే వైద్యం’ ఎంతో మంచిదని ఆమె కొనియాడారు.
ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయని, అందువల్ల కరోనా వైరస్ ప్రజలతో కలిసి ప్రయాణి స్తుందని, వైరస్ బారినపడకుండా ఉండాలంటే స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని డా. సౌమ్యా స్వామినాథన్ సూచించారు.