బంగ్లా యుద్ధం – 24
ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత విదేశాంగ విధానంలో మొదటిసారి అత్యంత దూకుడుతనం ప్రదర్శించి, తిరుగుబాటు ధోరణిని వ్యక్తం చేసిన సమయం. ఒక నూతన భారత దేశం ఆవిర్భవించినదని ప్రపంచానికి సందేశం ఇచ్చిన సమయం కూడా.
అప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రు ఆవలంభించిన అలీన ఉద్యమంపై భిన్నంగా ఆచరణాత్మక రాజకీయాలను దౌత్యం విధానంలో అమలు పరచి, మొత్తం ప్రపంచాన్ని అబ్బుర పరచిన సందర్భం కూడా. 1971 యుద్ధంలో భారతదేశాన్ని దురాక్రమణదారుగా చూడకూడదని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చాలా స్పష్టమైన ప్రయత్నం చేశారు. యుద్దానికి ముందు పాకిస్తాన్ సేనలు సాగిస్తున్న మారణకాండ గురించి వివరించడం కోసం ఆమె ప్రపంచ దేశాలను చుట్టి వచ్చారు.
ఆమె స్వయంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం, అమెరికాలలో 21 రోజుల పర్యటన చేశారు. తూర్పు బెంగాల్‌లోని సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కోసం యాహ్యా ఖాన్ పాలనపై ఒత్తిడి తీసుకురావాలని, పాక్ జైలులో పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలిలో ఏకాంత నిర్బంధంలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్‌కు జీవిత భద్రత కల్పించాలని ఆమె అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన కృషి చేసారు.
అమెరికాలో, తూర్పు పాకిస్తాన్ దుస్థితిని ఎత్తిచూపే విషయంలో ఆమె అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ ల ఆగ్రహాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె పట్ల వారు చాలా అసభ్య పదజాలం ఉపయోగించినట్లు తర్వాత కాలంలో వెలువరించి అమెరికా వర్గీకృత పత్రాలు వెల్లడించాయి.
ఒక విధంగా, డిసెంబర్ 3, 1971న, పాకిస్తానీ వైమానిక దళం తొమ్మిది భారతీయ వైమానిక స్థావరాలపై బాంబు దాడి చేయడం ద్వారా భారత్ అనుసరించిన దౌత్య విధానంపై అపూర్వమైన మద్దతు లభించేందుకు దారితీసినదని చెప్పవచ్చు. వెంటనే యుద్ధం అధికారికంగా ప్రారంభించడానికి ఆమెకు సువర్ణావకాశాన్ని పాకిస్థాన్ ఇచ్చిన్నట్లు అయింది. ఆ వెంటనే ఆమె ప్రతిపక్ష నాయకులను కలుసుకున్నారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ‘మనపై యుద్దాన్ని బలవంతంగా రుద్దారు’ అని చెప్పారు. 1971 యుద్ధం సమయంలో పాకిస్థాన్ కు మిత్రదేశం గా ఉన్న అమెరికాకు నాటి తూర్పు పాకిస్థాన్ లో తిరుగుబాటుకు భారత్ సహకరించడం, సైనిక జోక్యం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికే చైనాతో సంబంధాల కోసం పాకిస్థాన్ మధ్యవర్తిగా అమెరికా రహస్య ప్రయత్నాలు చేస్తున్న సంగతి ప్రపంచానికి తెలియదు.
అందుకోసమే పాక్ సేనల కిరాతక చర్యల పట్ల అమెరికా మౌనంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. పాకిస్థాన్ సైన్యం అక్కడ జరుపుతున్న మారణహోమాన్ని పట్టించుకోకుండా నిక్సన్ భారత్ ను మాత్రం సైనిక జోక్యం చేసుకోరాదని ప్రధాని ఇందిరా గాంధీపై తీవ్రమైన వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. నిక్సన్ కు తోడుగా కిస్సింజర్ కూడా ఈ విషయమై విఫల ప్రయత్నం చేశారు.
కిస్సింజర్ భారతదేశపు అతిపెద్ద విరోధులలో ఒకరిగా తెలిసిందే. అయితే తనకు ఇందిరా గాంధీ పట్ల తనకు లోతైన గౌరవం ఉందని, భారతదేశ ప్రయోజనాల పట్ల ఆమె నిబద్ధతను కలిగి ఉన్నారని అంటూ చాలాకాలం తర్వాత అంగీకరించారు. పైగా, భారతీయ ప్రధానులందరిలో, ఇందిరాగాంధీ లాగా అమెరికన్లకు ఎదిరించి, వారినెంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచిన మరో నేత లేరని కూడా కొనియాడారు.
ఇందిరా పట్ల అమెరికా అనుచిత పదజాలం
1971 యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ పట్ల ఉపయోగించిన అసభ్యపు పదజాలాన్ని కిస్సింజర్ 2005లో క్షమాపణలు చెప్పాడు. ఒక టివి ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: “35 సంవత్సరాల క్రితం ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో, అధ్యక్షుడు నిక్సన్ ఇంకా అక్కడ లేనప్పుడు నేను చైనాలో రహస్య పర్యటనకు వెళ్లినప్పుడు, భారతదేశం సోవియట్ యూనియన్‌తో పొత్తు పెట్టుకొంది” అంటూ ఆమె పట్ల ఆ నాడు తాము కనబరచిన ధ్వేషంకు కారణం చెప్పారు.
నవంబర్, 1971లో, అమెరికా అధ్యక్షుడితో అధికారిక సమావేశానికి ఆమె వెళ్లగా వైట్‌హౌస్‌లో ఇందిరా గాంధీని నిక్సన్, కిస్సింజర్ 45 నలభై ఐదు నిమిషాలు వేచి ఉండేటట్లు చేశారు. ఆ విధంగా ఆమెను అవమానపరచామని సంతోషించారు. చివరకు కలసినప్పుడు ఆమె నేరుగా సమస్యను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ జుంటాకు మద్దతు ఇవ్వడం అమెరికా పరిపాలన చేస్తున్న తప్పు అని ఆమె స్పష్టంగా ఎట్టి చూపారు.
అందుకు ప్రతిగా, మరుసటి రోజు, వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో తనను కలవడానికి వచ్చిన నిక్సన్ ను ఆమె తన వంతు వచ్చింది. ఇందిరా గాంధీ తన ప్రైవేట్ క్వార్టర్స్ నుండి బయటకు 45 నిముషాల సేపు ఆలస్యంగా వచ్చి, ఆయన వేచి ఉండేటట్లు చేశారు. ఐదేళ్లుగా దేశాధినేతగా ఆమె పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికా నాయకత్వంలో భారత దేశం పట్ల గల చులకన భావాన్ని బాగా అర్ధం చేసుకొన్నారు.
1966లో, లిండన్ జాన్సన్ భారతదేశం తన ప్రజలకు ఆహారం అందించడానికి ఏమి చేయాలో అంటూ ఆమెకు ఉపన్యాసం ఇచ్చారు. దానితో ఆమె స్వదేశంకు తిరిగి రాగానే హరిత విప్లవంకు శ్రీకారం చుట్టి ఆహార సమస్యలో స్వయం ఆధారితం అయ్యేందుకు కృషి చేశారు. నిక్సన్‌కు ఆమె పట్ల ఉన్న అయిష్టత ఎంత తీవ్రమైనదో వైట్‌హౌస్‌లోని వర్గీకరించబడిన పత్రాలు స్పష్టం చేశాయి. “నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయం కాని మహిళలు భారతీయులే” అని కూడా ఆమె గురించి వ్యాఖ్యానించినట్లు ఆ పత్రాలు తెలిపాయి.
1971కి ముందు, ఆ తర్వాత కూడా పాక్ నాయకులు, సైనికులు, పౌరులు ఆమెను కించపరిచే విధంగా వ్యవహరించినా ఆమె పట్టించుకోలేదు. 1970లో పాకిస్తాన్లో ఎన్నికల ప్రచారంలో ప్రాస లేదా కారణం లేకుండా, జుల్ఫికర్ అలీ భుట్టో ఆమె గురించి అనుచిత పదజాలం `మై’ ఉపయోగించారు. ‘మై’, ఉర్దూలో పనిమనిషి సేవకులను సూచించే అవమానకరమైన పదం.
ఈ సమయంలో అమెరికా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా, భారత్ పలు ఇతర దేశాల మద్దతు సమీకరించుకో గలిగింది. భారత్ కోర్కె మేరకు సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రెంచ్ అధినేతలు పాకిస్థాన్ అధ్యక్షునికి అణచివేత ఆపాలంటూ లేఖలు వ్రాసారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ వ్యతిరేక తీర్మానం విషయంలో ఈ రెండు దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. 1947 నుండి పాకిస్థాన్ కు సన్నిహితంగా ఉంటున్న బ్రిటన్ మొదటిసారిగా భారత్ పక్షం వహించింది.
భారత విదేశాంగ మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి/విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో డిసెంబర్ 12 నుండి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలకు హాజరయ్యారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం, పోలాండ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భుట్టో ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలించేందుకు కౌన్సిల్ తిరిగి సమావేశమైనప్పుడు కౌన్సిల్ “దురాక్రమణకు చట్టబద్ధత కల్పించడం కోసం”, “ఢాకా పడిపోవడానికి” వీలు కల్పిస్తూ వాయిదా వేస్తోందని ఆరోపిస్తూ సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయాడు.
పోలిష్ తీర్మానాన్ని చైనా వ్యతిరేకించింది. సోవియట్ యూనియన్ మరొక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ముసాయిదాను పరిశీలించడానికి ప్రతినిధుల కోసం డిసెంబరు 16 వరకు వాయిదా వేయాలని కోరడంతో సమావేశం అంగీకరించింది. డిసెంబర్ 16న మండలి తిరిగి సమావేశమైనప్పుడు, ఢాకాలో పాక్ సైన్యం లొంగిపోవడంతో బంగ్లాదేశ్‌లో పోరాటాలు నిలిచిపోయాయని స్వరణ్ సింగ్ తెలిపారు. భారతదేశం డిసెంబర్ 17న పశ్చిమ సెక్టార్లో కాల్పుల విరమణను ప్రకటించింది.
డిసెంబర్ 21న, మండలిలో 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన దాని పరిశీలనను ముగించడానికి సోమాలియా-ప్రవేశపెట్టిన తీర్మానం 307 (దీనికి సోవియట్ యూనిన్, పోలాండ్ దూరంగా ఉన్నాయి) ఆమోదించింది. ఇది మన్నికైన కాల్పుల విరమణ, బలగాలను ఉపసంహరించుకోవడం, యుద్ధ ఖైదీల విషయంలో 1949 నాటి జెనీవా ఒప్పందాలను సమర్థించడం, శరణార్థులను స్వదేశానికి రప్పించడం కోసం పిలుపునిచ్చింది.
దౌత్యపర విజయాలు
అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అశోక ముఖర్జీ పరిశీలనా ప్రకారం 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నాటి దౌత్య మంత్రాంగం నుండి మనకు నాలుగు కీలక ఫలితాలు కనిపిస్తాయి. ఈ దౌత్య కథనం నుండి నాలుగు ఫలితాలు వెలువడ్డాయి. మొదటిది, కాశ్మీర్ సమస్యతో సహా సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించడానికి రెండు దేశాలకు కట్టుబడి ఉండే చట్టపరమైన ఒప్పందం (జూలై 2, 1972 నాటి సిమ్లా ఒప్పందం). ఈ ఒప్పందం ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 102 కింద నమోదు కావడంతో భారత్ – పాకిస్థాన్ సమస్యలపై గతంలో సమితి తీసుకున్న నిర్ణయాలతో ఇక సంబంధం ఉండదు.
రెండవది, ఇది ఐక్యరాజ్య సమితిలో స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ప్రవేశానికి ముందే భారత్ ముందే మార్గంఏర్పరిచింది. (బంగ్లాదేశ్ సభ్యత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 25, 1972న కమ్యూనిస్ట్ చైనా మొదటి వీటోను అధిగమించిన తర్వాత), కొత్త దేశం ధోరణి, ఆకాంక్షలకు అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పర్చగలిగినది.
మూడవది, యుద్ధంపై దౌత్యపరమైన ప్రతిస్పందనలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామూహిక దురాగత నేరాలను నిరోధించడానికి ఆమోదించబడిన 1948 జాతి నిర్మూలనపై చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంలో ఐక్యరాజ్యసమితి నిస్సారతను యుద్ధం పట్ల దౌత్యపరా ప్రతిస్పందనలు వెల్లడి చేశాయి.
కాంబోడియా (1975-1979), స్రెబ్రెనికా (1992), రువాండా (1994), ఇరాక్‌లోని యాజిదీ మారణహోమం (2014) వంటి నేరాలను ఆ తర్వాత ఆపడంలో సమితి విఫలమైంది. నాల్గవది, ఇది బ్రిటీష్ భారత్ ను విభజించి విభజించడానికి అన్వయించిన 1947 నాటి “ద్వి-జాతి సిద్ధాంతాన్ని” సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాము. బంగ్లాదేశ్ ఆవిర్భావంతో దక్షిణాసియాలో జాతీయతకు మతం ఏకైక అంశం కాదని స్పష్టం చేసిన్నట్లయింది.