తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వాఖ్యలను సీరియస్ గా పరిగణించిన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య లపై తక్షణమే వివరణ ఇవ్వాలని స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ కు స్పష్టం చేసింది విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలిపింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో తన భార్య, కూతురితో కలిసి ప్రచారం చేపట్టిన ఆయన ఎమోషనల్ గా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించగా ఆ వాఖ్యలు కాస్త వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుండటంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నారు.
కాగా మంగళవారం ఉదయం కమలాపూర్ మండల కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ పనితీరును వివరిస్తూ ఓట్లడిగారు. ఆ తరువాత ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీస్తున్నాయి. మూడో తారీఖు ప్రజలంతా ఓట్లేసి దీవిస్తే ఎన్నికల జయయాత్రకు వస్తానని, లేకపోతే నాలుగో తారీఖున అందరూ తన శవయాత్రకు రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు చేశారు.
తన భార్య, బిడ్డతో పాటు తనను సాదుకుంటారో, చంపుకుంటారో ఆలోచన చేయాలని కోరారు. ‘మా జీవితాలు, ప్రాణాలు మీ చేతుల్లోనే పెడుతున్నా. నన్ను దీవించి గెలిపిస్తరా.. లేదంటే మేం ఉరి తీసుకోవాల్నా ఆలోచించండి’ అంటూ ఏమోషనల్ అయ్యారు. ‘మీ దయ, దండం.. మమ్ముల మీరే కాపాడుకోవాలే. లేదంటే మా ముగ్గురి శవాలు చూస్తరు’ అంటూ కామెంట్లు చేశారు.
దీంతో కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఇదికూడా ఒకరకంగా ఓటర్లను ప్రలోభ పెట్టినట్టే అవుతుందని, ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్న కౌశిక్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్ బరిలో నిలిచారు.