కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పంజాబ్ కేసును గుర్తించింది. గవర్నర్ వైఖరిపై కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
బిల్లులపై గవర్నర్‌కు వీటో అధికారం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిల్లును పెండింగ్‌లో ఉంచేందుకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు అప్పగించబడ్డాయని, ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభల సాధారణ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉపయోగించలేమని తేల్చి చెప్పింది.
అయితే, గవర్నర్ ఎనిమిది బిల్లులపై నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. బిల్లులపై చర్చించేందుకు సంబంధిత మంత్రితో పాటు పినరయి విజయన్‌తో భేటీ కావాలని కోర్టు సూచించింది.
ఎనిమిది బిల్లుల్లో ఏడింటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయగా, ఒక బిల్లును ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టు డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలుపగా.. కోర్టు పరిగణలోకి తీసుకున్నది.
గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం సరికాదని ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టులో విచారణకు ఒక్కరోజు ముందు గవర్నర్ కేరళ ప్రజారోగ్య బిల్లుకు ఆమోదం తెలిపారు. మిగిలిన ఏడు బిల్లలును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేశారు.
కాగా, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గడువులోగా ఆమోదించడం, లేదంటే తిరస్కరించడంపై గవర్నర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సవరించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. బిల్లుకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి, ఇన్చార్జి మంత్రి ఇద్దరితోనూ గవర్నర్ చర్చిస్తారని రికార్డులో ఉంచుతామని ధర్మాసనం పేర్కొంది.