‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన తరపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ఉమేశ్ చంద్ర పిటిషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆరోపించారు.
సజ్జలతో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి తో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ను కీర్తించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ పిటిషన్ ను బుధవారం హైకోర్టు విచారించింది.
సజ్జల, చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.