తెలంగాణాలో గురువారం జరిగిన పోలింగ్ లో తాము మంచి ఫలితాలు ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు బీజేపీ తరపున ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
అయితే, బీఆరెస్, కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంగించి డబ్బు, మద్యం పంపిణి చేశారని కేంద్ర మంత్రి విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మరింత కఠినంగా వ్యవహారించాల్సిందని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు
పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణి జరిగిందని పేర్కొంటూ అయినా చూసి చూడనట్లే వ్యవహరించారని కిషన్ రెడ్డి విమర్శించారు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని చెబుతూ అయినా ధైర్యంగా ఎదుర్కొని, ఎన్నికల్లో ముందుకు వెళ్లారని కొనియాడారు.
బీజేపీ కార్యకర్తలపై దాడులు, దొంగ ఓట్లతో అరాచకాలు సృష్టించారని చెబుతూ దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీజేపీ శ్రేణులు నిలబడి ఎన్నికలలో పోరాడినందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.
పోలింగ్ ముందు రోజు రాత్రి సాగర్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగన ఘటనను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. దుందుడుకు విధానంతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకపక్షంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్ నీళ్లు తరలించడం సరైన పద్దతి కాదని అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఇది వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్రతో కావాలనే చేశాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్య రాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా కోరుతూ లేఖ రాయాలని అనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.