నాగార్జున సాగర్ నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం, వందలాది మంది పోలీసులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా కుడికాలువకు నీటిని విడుదల చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా రంగ ప్రదేశం చేసి తాత్కాలిక ఉపశమనం కలిగించారు.
ప్రస్తుతం నెలకొన్న వివాదం గురించి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చిద్దామంటూ అప్పటివరకు గత నెల 30 ముందున్న పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వర్చ్యువల్ గా జరిపిన భేటీలో డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా డ్యామ్ పై రెండు రాష్ట్రాల పోలీసులను వెనుకకు పంపి, సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వందలాదిమంది పోలీసులను మోహరింపచేసి, బలవంతంగా నాగార్జున సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేస్తుండటం పట్ల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే నీటి విడుదలను ఆపివేయడం ద్వారా అక్కడ నెలకొన్న ఉద్రిక్తలను నివారించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వంకు లేఖ రాసింది.
ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.
కాగా, నాగార్జున సాగర్ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు బలవంతంగా చొచ్చుకు రావడంపై ఎస్పీఎఫ్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు. సిసి కెమెరాలు ధ్వంసం చేసి, తమ భూభాగంలో బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 447, 427 కిందతెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగార్జున సాగర్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. బుధవారం రాత్రి నుంచి నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొన సాగుతున్నాయి. 13వ నంబర్ గేట్ వరకు ఏపీ కుడి కాలువకు బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 520 అడుగులకు చేరింది. గురువారం నుంచి సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేస్తోంది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నాు. డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి.
బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి వందలాది మంది పోలీసులు ప్రవేశించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్ల పై నుంచి లోపలకు దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేశారు.
అడ్డుకునేందుకు తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించినా ఏపీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సాధ్యపడ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు అక్రమంగా చొరబడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.